చిన్న తరహా పరిశ్రమలకు హామీలేని రుణాలు
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : చిన్న, సూక్ష్మ స్థాయి పరిశ్రమలకు, వ్యాపారాలకు ఎలాంటి హామీ లేకుం డా రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు జాతీయ బ్యాంకులు రుణాలు అందజేస్తాయని చిన్న, సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ బీవీ రామారావు తెలిపారు. తాడేపల్లిగూడెంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ దీనికి సంబంధించి 60 ఏళ్ల తర్వా త రిజర్వు బ్యాంకు ఈ నెల 29న కాకినాడలో సమావేశం నిర్వహించనుందని వివరించారు. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజస్ పథకం కింద ఎలాంటి ష్యూరిటీలు, థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండా బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పిస్తుందన్నారు.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో వేలాదిమంది ఈ పథకాన్ని వినియోగించుకొని లబ్ధిపొందారని తెలిపారు. ఔత్సాహికులు ప్రాజెక్టులతో తమ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. కాకినాడ ఆర్‌బీఐ సమావేశానికి బ్యాంకుల చీఫ్ మేనేజర్లు, ఆర్‌బీఐ రీజినల్ డెరైక్టర్ కేఆర్ దాస్ తదితరులు పాల్గొంటారని చెప్పారు. ఖాయిలాపడిన పరిశ్రమలను తెరవాలనుకునేవారు ఈ నెల 27న హైద్రాబాద్‌లో జరిగే ఎంపవర్డ్, స్లీక్ కమిటీ సమావేశానికి హాజరుకావాలని సూచించారు. ఇతర వివరాలకు 98666 49369 ఫోన్ నంబరులో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.