14 మంది ప్రాణం తీసిన నిద్రమత్తు
లక్నో: ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. 24 మందిపైగా గాయపడ్డారు. ఎతాహ్ జిల్లా సరాయ్ నీమ్ ప్రాంతం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మినీ బస్సు కాల్వలో ఈ ప్రమాదం జరిగిందని జిల్లా అధికారులు తెలిపారు. మృతులు ఆగ్రాకు చెందినవారుగా గుర్తించారు. పెళ్లికి ముందు జరిగే వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
క్షతగాత్రులను ఆగ్రాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. సాక్రౌలీ గ్రామం నుంచి ఆగ్రాకు వస్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం చోటుచేసుకున్నట్టు భావిస్తున్నారు. వేగంగా ప్రయాణిస్తున్న బస్సు రోడ్డు మలుపులో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బోల్తా పడిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా మేజిస్ట్రేట్, సీనియర్ ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు.