ఇంటికో మొబైల్ విద్యార్థికో ట్యాబ్లెట్
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ ఊపిరి సలపని రీతిలో వరా లు గుప్పించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. గ్రా మాల్లో ఓట్లను కొల్లగొట్టేందుకు ఇటీవలే ఆహార భద్రత బిల్లు తెచ్చిన ప్రభుత్వం... మరింత మంది గ్రామీణులకు గాలం వేసేందుకు ‘ఇంటికో మొబైల్ ఫోన్, విద్యార్థికో ట్యాబ్లెట్ పీసీ’ నినాదాన్ని ముం దుకు తెస్తోంది. గ్రామాల్లో నివసిస్తున్న 2.5 కోట్ల మందికి మొబైల్ ఫోన్లను, ప్రభుత్వ స్కూళ్లలో 11, 12 తరగతులు చదువుతున్న 90 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్లెట్ పీసీలను ఉచితంగా అందించే పథకాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ మేరకు టెలికామ్ విభాగంలో అత్యున్నత నిర్ణాయక వ్యవస్థయిన టెలికామ్ కమిషన్‌కు ఒక నోట్‌ను పంపింది. ఇది టెలికామ్ కమిషన్ ఆమోదం పొందితే కేబినెట్‌కు వెళ్తుంది. అక్కడ ఆమోదిస్తే... 2014 మార్చి నుంచి అమల్లోకి వచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. అంటే...సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల ముందు!
ఈ మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ల పథకానికయ్యే మొత్తం ఖర్చు రూ.10వేల కోట్లు. మొబైల్ ఫోన్లతో పాటు వాటికి సిమ్ కార్డులు, ఏటా రూ.360 చొప్పున రెండేళ్ల పాటు ఉచిత రీఛార్జి కూడా అందించాలన్నది ప్రతిపాదన. ఈ ప్యాకేజీలో 30 నిమిషాల టాక్‌టైమ్, 30 ఎస్‌ఎంఎస్‌లు, 30 మెగాబైట్ల వరకూ ఇంటర్నెట్ కూడా కలిసి ఉంటుంది. ట్యాబ్లెట్లతో పాటు కూడా సిమ్ అందజేస్తారు. కొన్నాళ్లపాటు 500 మెగాబైట్ల ఇంటర్నెట్, రూ.75 విలువైన టాక్‌టైమ్, 75 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా అందజేస్తారు.
బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా అమలు: భారత్‌లో మొబైల్ వాడకందార్ల సంఖ్య 90 కోట్ల పైనే. చైనా తరవాత ఇక్కడే ఎక్కువ. ప్రభుత్వ వర్గాల సమాచారం మేర కు... ఈ ట్యాబ్లెట్ పీసీ పథకానికయ్యే 4,972 కోట్లను టెలికాం విభాగం, యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్(యూఎస్‌ఓఎఫ్) కలిసి 40:60 నిష్పత్తిలో భరిస్తాయి. ఇక మొబైల్ ఫోన్ల పథకానికొస్తే వీటిని ప్రధానంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికులకు అందజేస్తారని, దీనివల్ల ప్రభుత్వంపై రూ.4,850 కోట్ల భారం పడుతుందని సమాచారం. పథకాన్ని మొదలుపెట్టేది 2014 మార్చిలోనే అయి నా... ఫోన్ల కేటాయింపు పూర్తి చేయడానికి మాత్రం ఆరేళ్లు పడుతుంది. తుది వ్యయమనేది బిడ్డింగ్ ప్రకియపై ఆధారపడి ఉంటుంది.
‘ఈ పథకాన్ని ప్రభుత్వ నిర్వహణలోని బీఎస్‌ఎన్‌ఎల్ అమలు చేస్తుంది. ఫోన్లు, ట్యాబ్లెట్ల కోం బిడ్డింగ్ ప్రక్రియను అదే నిర్వహిస్తుంది. ఫోన్లు, ట్యాబ్లెట్లను మూడేళ్ల వారెంటీతో సహా అందజేస్తాం. ట్యాబ్లెట్లను తొలి దశలో 15 లక్షలు, రెండో దశలో 35 లక్షలు, మూడో దశలో 45 లక్షల చొప్పున మూడు దశల్లో అందజేస్తాం. ఫోన్లను మాత్రం 25 లక్షలు, 50 లక్షలు, 75 లక్షలు, కోటి చొప్పున నాలుగు దశల్లో అందజేస్తాం’ అని ప్రభుత్వ వర్గాలు వివరించాయి.