సాక్షి,బాన్సువాడ(నిజామాబాద్): ఎన్నికల్లో అభ్యర్థులు ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం టెక్నాలజీ విస్తరించడంతో పాటు స్మార్ట్‌ఫోన్ల రాకతో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లను వినియోగించుకోవడంలో ఎన్నికల సంఘం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. అభ్యర్థులకు సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతులను ‘సువిధ’ యాప్ ద్వారా అందజేస్తుండగా, తాజాగా ప్రజల చేతుల్లో బ్రహ్మాస్తంగా సీ–విజిల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా అభ్యర్థులు చేసే అక్రమాలను ఫొటోలు, వీడియోల రూపంలో సేకరించి చర్యలకు ఉపక్రమించనుంది. ప్రజలు నేరుగా ఫొటోలు, వీడియోలను తీసి, సీ–విజిల్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తే, ఆ ఫొటోలు జిల్లా ఎన్నికల అధికారి(కలెక్టర్)కు వెళ్తాయి. ఇలా వచ్చిన ఫొటోలు/వీడియోల్లో వాస్తవాలు ఉంటే 100 నిమిషాల్లోపు సంబంధిత అభ్యర్థిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు ప్రకటిస్తున్నారు. ఫొటోలు పంపిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు.
డౌన్‌లోడ్‌చేసుకోవడం ఇలా..
స్మార్ట్ ఫోన్ ఉన్న వ్యక్తి గూగుల్ యాప్‌లోకి వెళ్లి సీ–విజిల్ (G-VISIL) యాప్ అని టైప్ చేయాలి. ఆ యాప్ వచ్చిన వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలి. జీపీఎస్‌ను ఆన్ చేసి, తమ పేరు, మొబైల్ నంబర్, అడ్రస్‌ను నమోదు చేయాలి. రాష్ట్రం, జిల్లా పేర్లను నమోదు చేశాక యాప్ ప్రారంభమవుతుంది. నేరుగా ఫొటో లేదా వీడియాను తీసి సెండ్ చేస్తే, అది సంబంధిత జిల్లా ఎన్నికల అధికారికి చేరుతుంది. ఆ ఫొటో ద్వారా 100 నిమిషాల్లోపు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన పక్షంలో చర్యలు తీసుకుంటారు.
వీటిపై ఫిర్యాదు చేయవచ్చు
- అభ్యర్థులు, అనుచరులు ఓటర్లకు నగదు పంపిణీ
- మద్యం/మాదక ద్రవ్యాల పంపిణీ
- ఉచితంగా ఓటర్ల రవాణా
- కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు
- ప్రలోభపెట్టే వస్తువుల పంపిణీ
- ఓటర్లను బెదిరించడం
- మారణాయుధాలు కలిగి ఉండడం
- అసత్య వార్తల ప్రసారం, చెల్లింపు వార్తలు
- ప్రజల ఆస్తులను నష్ట పర్చడం, వినియోగించడం
Comments
Please login to add a commentAdd a comment