ప్రపంచమంతా ఉచితంగా ఇంటర్ నెట్!
వాషింగ్టన్: ఏదో పనిమీద ఓ పల్లెటూరుకు వెళ్లారు.. ఎక్కడో గిరిజన ప్రాంతంలోనో, అడవిలోనో, సముద్రంలో ప్రయాణిస్తూనో ఉన్నారు.. అత్యవసరంగా ఈమెయిల్ పంపించాల్సి ఉన్న సమయంలో జస్ట్ మీ ల్యాప్‌టాప్‌నో, స్మార్ట్‌ఫోన్‌నో తీసి... వైఫై ఆన్ చేసుకుంటాం.ఇంటర్‌నెట్ వచ్చేస్తుంది. దీనికి కొంత సొమ్ము ఛార్జ్ చెల్లిస్తాం.
అదే ఉచితంగా..!? ఇలా జరిగితే బాగుంటుంది కదూ.. అమెరికాకు చెందిన ‘మీడియా డెవలప్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఎండీఐఎఫ్)’ స్వచ్ఛంద సంస్థ ఆలోచన కార్యరూపం దాల్చితే ఇదంతా వాస్తవం కానుంది. అంతరిక్షంలోకి కొన్ని వందల చిన్న కత్రిమ ఉపగ్రహాలను పంపి, వాటిని భూమిపై ఏర్పాటు చేసే గ్రౌండ్ స్టేషన్లకు అనుసంధానించే ‘ఔటర్‌నెట్’కు ఈ సంస్థ రూపకల్పన చేసింది.
సైబీరియా మంచు ప్రాంతాలు, ఆఫ్రికా అడవులు, సముద్ర ప్రయాణంలో.. ఇలా భూమ్మీద ఎక్కడున్నా... జస్ట్ సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌తో ఇంటర్‌నెట్‌ను అందుకోవచ్చు. ఎండీఐఎఫ్ సంస్థ ఈ ‘ఔటర్‌నెట్’కు ప్రణాళికలు వేయడమే కాదు.. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం నిధులనూ సేకరిస్తోంది. వచ్చే ఏడాది కొన్ని చిన్న కత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది కూడా. ఈ ప్రాజెక్టుకు కొన్ని వేల కోట్ల రూపాయలు వ్యయమవుతాయని అంచనా.