చైనాకు ట్రంప్ తొలి సవాల్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా చైనాకు సవాల్ విసిరారు. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చైనా నిర్మించిన కృత్రిమ దీవుల సమీపంలోకి అమెరికా యుద్ధనౌక ఒకటి చొచ్చుకెళ్లింది. దక్షిణ సముద్ర జలాలను వ్యూహాత్మకంగా భావిస్తున్న చైనా.. వీటిపై ఆధిపత్యం తనదేనని వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిసారిగా చైనా నిర్మించిన ఓ కృత్రిమ దీవిలో 12 నాటికల్ మైళ్లు అమెరికన్ నేవీ యుద్ధనౌక ప్రయాణించినట్టు ఆ దేశ అధికారులు తెలిపారు.
పొరుగుదేశాలతో పలు వివాదాలు ఉన్నా లెక్కచేయకుండా చైనా దూకుడుగా దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవులు, దిబ్బలు, ఇసుక రేవులు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటైన స్ప్రాట్లీ దీవులలోని మిస్‌చీఫ్ రీఫ్‌కు అత్యంత సమీపంలో యూఎస్‌ఎస్ డీవే యుద్ధనౌక సంచరించినట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు.
అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛాయుత నౌకయానం ఉండాలని అమెరికా వాదిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అగ్రరాజ్యం తలపెట్టిన ఈ చర్య చైనాకు ఆగ్రహం తెప్పించే అవకాశముంది. చైనా మిత్రపక్షం ఉత్తరకొరియా అణ్వాయుధ పరీక్షలను కట్టడి చేసేందుకు ఆ దేశం సహకారాన్ని ట్రంప్ కోరుతున్న సమయంలోనే ఇలాంటి ఘటన జరగడం గమనార్హం. అయితే, దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యం చెల్లబోదంటూ హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తొలిసారి అమెరికా ఈ ఆపరేషన్ చేపట్టినట్టు ఆ దేశ అధికారులు చెప్తున్నారు.