మొబైల్స్ జోరు.. తగ్గిన ల్యాండ్ లైన్లు
న్యూఢిల్లీ : గడచిన ఐదేళ్ల కాలంలో ల్యాండ్ లైన్ ఫోన్ కనెక‌్షన్లు భారీగా పడిపోయాయని కమ్యూనికేషన్ల మంత్రి మనోజ్‌సిన్హా తెలిపారు. ఒక ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభలో శుక్రవారం ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2012 లో ఈ కనెక‌్షన్ల సంఖ్య 3.21 కోట్లయితే, అవికాస్తా 2016 నాటికి 2.52 కోట్లకు పడిపోయినట్లు తెలిపారు.
2017 జనవరి 31నాటికి దేశంలో ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక‌్షన్లు 2.43 కోట్లు ఉన్నట్టు మంత్రి తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లు వివిధ ఆకర్షణీయమైన పథకాలతో ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక‌్షన్ల సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వివరించారు. కాగా 2017 మార్చి 19 నాటికి 16,833 గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని కల్పించినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.