
చిరుత కూడా చిన్నబోయేలా..
రియో డిజెనీరో: చిరుతపులే చిన్నబోయేలా.. లేడి కూడా సిగ్గుపడేలా.. రేసుగుర్రం ఆగి చూసేలా.. రెప్పపాటులో మెరుపువేగంతో అతడు సృష్టించిన చరిత్ర గురించి చెప్పాలంటే ఇలాంటి ఉపమానాలు ఎన్ని చెప్పినా సరిపోదేమో. అందరూ ఊహించినట్టే జమైకన్ స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విజయాన్ని నమోదుచేశాడు. కేవలం 9.81 సెకన్లలో పురుషుల వందమీటర్ల పరుగుపందెన్ని పూర్తిచేసి.. వరుసగా మూడోసారి ఒలింపిక్స్ స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన అత్యుత్తమ అథ్లెట్ గా చరిత్రలో చెరిగిపోని రికార్డు సాధించాడు.
రియో ఒలింపిక్స్ లో ఆదివారం పురుషుల వంద మీటర్ల పరుగుపందెం హోరాహోరీగా సాగింది. జమైకన్ చిరుతగండు బోల్ట్ కి అమెరికన్ పరుగులవీరుడు జస్టిన్ గాట్లిన్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. క్షణంలో అతికొద్దితేడాతో తనదే పైచేయి అని బోల్ట్ నిరూపించుకున్నాడు. 9.81 సెకన్లతో బోల్ట్ ప్రథమస్థానంలో నిలిచి స్వర్ణం గెలుపొందగా.. గాటిన్ 9.84 సెకన్లతో రేసును పూర్తిచేసి రజతంతో సరిపెట్టుకున్నాడు. కెనడా పరుగులవీరుడు అండ్రీ డి గ్రాస్ 9.91 సెకన్లతో మూడోస్థానంలో నిలిచి కాంస్యం పతకాన్ని అందుకున్నాడు.
పురుషుల వందమీటర్ల పరుగు పందెంలో ఇది బోల్ట్ కు మూడో స్వర్ణం. అతను 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్ లలో స్వర్ణాలను సాధించాడు. గాయాలు వేధిస్తున్నా.. సరైన ఫామ్ లో లేకపోయినా.. ఈ జమైకా చిరుత విశ్వక్రీడల వేదికపై తన అసలు సత్తా ఏమిటో చాటాడు. పరుగుపందెంలో విజయం సాధించిన వెంటనే ఉసెన్ బోల్ట్ లో ఆనందం పరవళ్లు తొక్కింది. తనకు ప్రోత్సాహం ఇచ్చిన మైదానంలోని ప్రేక్షకులకు అతడు కృతజ్ఞతలు తెలిపాడు.