ఈ కోతలేంటి కిరణ్?: వాసిరెడ్డి పద్మ | Vasireddy padma takes on kirankumar reddy | Sakshi
Sakshi News home page

ఈ కోతలేంటి కిరణ్?: వాసిరెడ్డి పద్మ

Published Wed, Oct 23 2013 2:43 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

ఈ కోతలేంటి కిరణ్?: వాసిరెడ్డి పద్మ - Sakshi

ఈ కోతలేంటి కిరణ్?: వాసిరెడ్డి పద్మ

కరెంటు కోతలపై వాసిరెడ్డి పద్మధ్వజం
ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసేందుకు సీఎం కుట్రలు చేస్తున్నారని విమర్శ

 
 సాక్షి, హైదరాబాద్: నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటినుంచి రాష్ట్రంలో కరెంటు కోతలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. విస్తారంగా వర్షాలు కురిసినప్పటికీ ఇంతగా కోతలు విధించడమేంటని మండిపడ్డారు. పరిశ్రమలకు 6గంటలు, గ్రామాల్లోనైతే 12 గంటల పాటు కోతలు విధిస్తున్నారని చెప్పారు. మరోవైపు, ప్రపంచబ్యాంక్ ఆదేశాల మేరకు ఉచిత విద్యుత్‌ను ఎత్తేసేందుకు కిరణ్ ప్రభుత్వం దొంగదారులు వెతుకుతోందని మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ పద్మ విమర్శించారు.
 
  ప్రపంచబ్యాంకు ఆదేశాలను అమలు చేసే విషయంలో 2004కు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరించినట్లే ఇప్పుడు సీఎం కిరణ్ కూడా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రపంచబ్యాంక్ మెడలు వంచి, షరతులను కాదని రైతులను ఆదుకోవడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌ను అమలుపరిస్తే, ఆయన మరణానంతరం దాన్ని తుంగలో తొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. నగదు బదిలీ పేరుతో ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేందుకు కిరణ్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అండతో ప్రభుత్వం రెచ్చిపోయి ప్రజలను అష్టకష్టాలకు గురిచేస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యంపై ఒక్క మాట మాట్లాడకుండా తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై బురద చల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఆమె విమర్శించారు.
 
 కిరణ్, చంద్రబాబు సమైక్య ద్రోహులు
 సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కిరణ్, చంద్రబాబు.. ఇద్దరూ కలిసి కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఒక పథకం ప్రకారం ఉద్యోగులను రెచ్చగొట్టి, కొంతకాలం తర్వాత.. ఆ ఉద్యమం రాజకీయ మలుపు తిరగకుండా కుట్రపూరితంగా వ్యవహరించి సమైక్య ఉద్యమాన్ని కిరణ్ నీరుగార్చారని విమర్శించారు. సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత చం ద్రబాబు సీమాంధ్రకు నాలుగైదు లక్షల కోట్లు కావాలనడం, మం త్రుల బృందం వద్దకు వెళ్లాలని ఉద్యమం చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులకు కిరణ్ చెప్పడం.. ఇదంతా  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సో నియాగాంధీ డెరైక్షన్ ప్రకారమే జరుగుతోందని పద్మ పేర్కొన్నారు.  
 
 సమైక్య శంఖారావం అంటే భయపడుతున్న టీడీపీ
 సమైక్యశంఖారావం సభ అంటేనే సీమాంధ్ర టీడీపీ నేతలకు భయం పట్టుకుందని పద్మ అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటే తమ పబ్బం గడవదనే వారు విభజనకు అనుకూలంగా మాట్లాడుతూ, సమైక్య సభకు వెళ్లొద్దంటూ ఫత్వాలు జారీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చంద్రబాబుపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని సీమాంధ్ర టీడీపీ నేతలను ఆమె ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోకముందే నీటి కోసం చిత్తూరు, నెల్లూరు జిల్లాల ప్రజలు కొట్టుకునే పరిస్థితి తలెత్తిందని, రేపు రెండు రాష్ట్రాలు ఏర్పడితే మరెన్ని తగవులు చోటుచేసుకుంటాయో తెలియదా? అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలని పద్మ డిమాండ్ చేశారు. సమైక్య వాదం వినిపిస్తున్న మూడు పార్టీలకు తోడుగా తెలుగుదేశం పార్టీ కూడా వస్తే.. విభజన ప్రక్రియ ఆగిపోతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement