ఏపీ స్క్రీనింగ్ కమిటీ ఇన్‌చార్జిగా వాయలార్
ఏపీ స్క్రీనింగ్ కమిటీ ఇన్‌చార్జిగా వాయలార్
Published Fri, Jan 10 2014 1:28 AM | Last Updated on Sat, Jun 2 2018 5:10 PM
లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ అన్ని రాష్ట్రాలకు స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర కమిటీలో వాయలార్‌తో పాటు దిగ్విజయ్, బొత్స, కిరణ్, భక్తచరణ్‌దాస్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు జనవరి చివరినాటికి దేశవ్యాప్తంగా 150-200 మంది అభ్యర్థులతో జాబితా రూపొందించనున్నాయి.
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలోకి దింపాల్సిన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు పార్టీ అధినేత సోనియాగాంధీ ఆమోదముద్ర కూడా వేశారు. ఆంధ్రప్రదేశ్ స్క్రీనింగ్ కమిటీకి పార్టీ సీనియర్ నేత వాయలార్ రవి నేతృత్వం వహించనున్నారు. గోవా, కర్ణాటక కమిటీలకు కూడా ఈయనే ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు. మొత్తం ఐదుగురితో కూడిన ఈ కమిటీలో సంబంధిత రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నాయకుడితోపాటు మరొక రు సభ్యులుగా ఉంటారు. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ స్క్రీనింగ్ కమిటీలో వాయలార్ రవితోపాటు దిగ్విజయ్‌సింగ్, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ, సీఎల్పీ నాయకుడు కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు ఐదో సభ్యుడిగా భక్త చరణ్ దాస్ ఉండనున్నారు. రాష్ట్రానికి చెందిన పార్టీ నేత జి.చిన్నారెడ్డిని అరుణాచల్‌ప్రదేశ్ స్క్రీనింగ్ కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఈనెల 17న ఏఐసీసీ కీలక భేటీ కానుంది. ఈ సమావేశంలోనే రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది. ఈ ప్రక్రియ ముగియగానే ఈ స్క్రీనింగ్ కమిటీలు పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించనున్నట్లు తెలిసింది. అభ్యర్థుల పేర్లను ముందుగానే ఖరారు చేయాలని రాహుల్‌గాంధీ భావిస్తున్నారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలని గతంలో కూడా ఆంటోనీ కమిటీ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగంగానే సాగనుంది. మొత్తమ్మీద ఈనెల చివరినాటికి 150-200 మంది అభ్యర్థులతో ఒక జాబితా తయారు చేయాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.
సిట్టింగులందరికీ టికెట్లు ఇవ్వలేం: సిట్టింగ్ ఎంపీలందరికీ టికెట్లు దక్కకపోవచ్చని పార్టీ సంకేతాలు పంపింది. యూపీఏ పదేళ్లపాటు అధికారంలో ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
Advertisement
Advertisement