జయలలిత ఆరోగ్యంపై మోదీ ఆరా
చెన్నై: తీవ్ర ఆందోళనకరంగా ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరాతీశారు. ప్రస్తుతం చెన్నైలోనే ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సోమవారం రాత్రి ప్రధానికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. పరిస్థితులు చక్కబడేంత వరకూ వెంకయ్య చెన్నైలోనే ఉండాలని మోదీ ఆదేశించినట్లు తెలిసింది.
అపోలో ఆస్పత్రిలో జయలలితకు చికిత్స అందిస్తున్న వైద్యులు తనకు చెప్పిన విషయాలను వెంకయ్య.. మోదీతో పంచుకున్నారు. సోమవారం సాయంత్రం ఆస్పత్రికి వచ్చిన వెంకయ్య.. మొదట వైద్యులతో మంతనాలు జరిపి, మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఇన్‌చార్జి గవర్నర్ విద్యాసగర్‌రావు, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం అయ్యారు. కొందరు ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు, మెఖ్యనేతలను కూడా వెంకయ్య కలుసుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, జయలలిత ఆరోగ్యంపై నేటి అర్ధరాత్రి లోగా మరో ప్రకటన విడుదలయ్యే అవకాశాలున్నాయని చెన్నైలోని ‘సాక్షి’ ప్రతినిధులు చెప్పారు. జయ ఆసుపత్రిలో చేరిన సెప్టెంబర్‌లోనే ప్రధాని మోదీ ఆమెను పరామర్శించాలని భావించినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పర్యటన రద్దైన సంగతి తెలిసిందే.