మోదీ ముందు సీఎం, శశికళ కంటతడి
చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ.. జయలలిత పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు వెళ్లిన మోదీ.. విమానాశ్రయం నుంచి జయలలిత పార్థివదేహం ఉంచిన రాజాజీ హాల్‌కు చేరుకున్నారు. జయలలిత పార్థివదేహం వద్ద ప్రధాని మోదీ పుష్పగుచ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. జయలలిత స్నేహితురాలు శశికళను మోదీ పరామర్శించారు. ఈ సందర్భంగా శశికళ, తమిళనాడు ముఖ‍్యమంత్రి పన్నీరు సెల్వం కన్నీటి పర్యంతమయ్యారు. మోదీ.. వీరిద్దరినీ ఓదార్చారు. పన్నీరు సెల్వం భుజం తట్టి క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాల్సిందిగా చెప్పారు.
జయలలితను చివరిసారి చూసేందుకు వచ్చిన ప్రముఖులకు, ప్రజలకు మోదీ అభివాదం చేశారు. మోదీ వెంట తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు వచ్చారు. అక్కడే ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడితో మోదీ కాసేపు మాట్లాడారు. ఈ రోజు సాయంత్రం మెరీనా బీచ్‌లో గురువు ఎంజీఆర్ సమాధి పక్కన జయ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీతో పాటు ఎఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు.. జయలలిత అంత్యక్రియల్లో పాల్గొంటారు.