ఆరుషీ హత్య కేసులో మధ్యాహ్నం తుది తీర్పు
న్యూఢిల్లీ : అయిదేళ్ల పాటు అనేక మలుపులు తిరుగుతూ సాగిన ఆరుషి జంట హత్యల కేసు విచారణ ఎట్టకేలకు తుదిదశకు చేరింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నేడు కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఘజియాబాద్ కోర్టు వద్ద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రధాన న్యాయమూర్తి శ్యామ్ లాల్ మధ్యాహ్నం 2 గంటలకు తీర్పును వెల్లడించనున్నారు. ఈకేసుకు సంబంధించి 15 నెలల్లో 84 మంది సాక్షులను సీబీఐ విచారించింది. తల్లిదండ్రులు డాక్టర్ రాజేశ్ తల్వార్, ఆయన భార్య నుపుర్ తల్వార్ లే కూతురు ఆరుషి, తమవద్ద సర్వెంట్గా ఉన్న హేమరాజ్ను హత్య చేశారని ఛార్జీషీట్ లో పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ నోయిడాలోని జలవాయు విహార్‌లోని తన నివాసంలో మే15, 2008న 14 ఏళ్ల బాలిక ఆరుషి హత్యకు గురైంది. నిందితుడిగా అనుమానించిన ఆ ఇంటి పనిమనిషి హేమ్‌రాజ్ కూడా ఆ తరువాత అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరుషి తల్లిదండ్రులు నూపుర్ తల్వార్, రాజేష్ తల్వార్ ఉన్నారు. ఈ హత్య మిస్టరీగా మారడంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ప్రారంభం నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. జాతీయ స్థాయిలో ప్రజలు ఈ కేసు తీర్పు పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.