మాల్యాకు షాక్...కీలక పరిణామం
న్యూఢిల్లీ: వేలకోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను తిరిగి దేశానికి రప్పించే ప్రక్రియలో మరో కీలక అడుగు పడింది. సుమారు రూ 9,000 కోట్ల మేరకు రుణ డిఫాల్ట్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యాను వెనక్కి రప్పించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా విదేశాంగ శాఖ అభ్యర్థనను బ్రిటన్ ప్రభుత‍్వం ఆమోదించింది. ఈ మేరకు యూకే మాజిస్ట్రేట్ మాల్యాపై అరెస్ట్ వారెంట్ జారీ చేయొచ్చని భావిస్తున్నారు. పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాను అప్పగించే విషయంలో భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అభ్యర్థను బ్రిటన్ స్టేట్ సెక్రటరీ ఆమోదించిందని పీటీఐ నివేదించింది.
బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను అప్పగించాల్సిందిగా కోరుతూ ఎక్ట్రాడిషన్ రిక్వెస్ట్ ను భారత విదేశాంగ శాఖ బ్రిటన్ ప్రభుత్వానికి అంద జేసింది. నేరస్థుల అప్పగింతకు సంబంధించి భారత్ –బ్రిటన్ ల 1993 నాటి ఒప్పందం నేపథ్యంలో విజయ్ మాల్యాను బ్రిటన్ అప్పగించాలని కోరింది.
కాగా మాల్యాను స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు ఇంకా పెండింగ్ లోఉన్నాయని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి కె సింగ్ గురువారం రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు. గత అయిదు సంవత్సరాల కాలంలో ఫ్యుజిటివ్ క్రిమినల్ సమీర్ బాయ్ విను భాయ్ పటేల్ ఒక్కడినే రప్పించగలిగామని చెప‍్పారు. మాల్యాతో సహా పారిపోయిన నేరస్తులకు సంబంధించి భారత 10 అప్లికేషన్లు బ్రిటన్ లో పెండింగ్ లో ఉన్నట్టు చెప్పారు.