ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై కేంద్రం స్పష్టత
న్యూఢిల్లీ : గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టుల కింద నిర్వాసితులవుతున్న ఆదివాసీల పునరావాస సమస్యలపై వైఎస్సార్సీపీ ఎంపీ(రాజ్యసభ) విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రప్రభుత్వం సమాధానమిచ్చింది. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్(ఎన్సీఎస్టీ) ఆయా ప్రాంతాల్లో పర్యటించినట్టు, 2016 ఆగస్టు 3న నిర్వహించిన ఎన్సీఎస్టీ భేటీ వివరాలను పిటిషనర్లకు తెలిపినట్టు గిరిజన వ్యవహారాల శాఖామంత్రి రాజ్యసభ్యలో లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఎన్సీఎస్టీ ఈ వివరాలను ఆదివాసీలకు, వారి ప్రతినిధులకు నిరాకరించినట్టు తెలిసిందని, దాని వెనుక గల కారణాలేమిటని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.
అయితే భేటీ వివరాలను ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి పోలవరం ప్రాంతానికి చెందిన ప్రధాన ఫిర్యాదుదారుడు పీ. పుల్లారావుకు ఎన్సీఎస్టీ అందించిందని కేంద్రం వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు సైట్లో ఎన్సీఎస్టీ 2014 జనవరి 7 నుంచి జనవరి 11వరకు పర్యటించిందని, దీనిపై ఓ విచారణ రిపోర్టు తయారుచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించామని కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకింద నిర్వాసితులవుతున్న ఆదివాసీల కోసం ఏపీ ప్రభుత్వం ఎలాంటి పునరావాస చర్యలు తీసుకుందో సమీక్షించడానికి 2016 జనవరి 25 నుంచి 31 వరకు మరోసారి ఎన్సీఎస్టీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించినట్టు కూడా పేర్కొంది. ఈ మేరకు ఎన్సీఎస్టీ ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు చేసిందని కేంద్రం తెలిపింది.