సెలవు రద్దు చేసుకున్న సీపీ గౌతమ్ సవాంగ్ | vijayawada police commissioner gautam sawang cancels his leave | Sakshi
Sakshi News home page

సెలవు రద్దు చేసుకున్న సీపీ గౌతమ్ సవాంగ్

Published Wed, Dec 16 2015 12:04 PM | Last Updated on Sun, Sep 3 2017 2:06 PM

సెలవు రద్దు చేసుకున్న సీపీ గౌతమ్ సవాంగ్

సెలవు రద్దు చేసుకున్న సీపీ గౌతమ్ సవాంగ్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసును వెలుగులోకి తీసుకొచ్చిన విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్.. తన దీర్ఘకాలిక సెలవును రద్దు చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు 15 రోజులు సెలవు కావాలని దరఖాస్తు చేసుకున్న సవాంగ్, ఆ ఆలోచనను విరమించుకుని బుధవారం విధులకు హాజరయ్యారు. కాల్ మనీ కేసు విచారణను మీరే చేపట్టాలంటూ బాధితులు విన్నవించడంతో సవాంగ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు సమాచారం. ముక్కుసూటి వ్యక్తిగా పేరున్న సవాంగ్ రాజకీయ ఒత్తిళ్లతో సెలవుపై వెళ్లారని, ఆయన స్థానంలో ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి సురేంద్ర బాబుకు బాధ్యతలు అప్పగించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

దీనిపై గౌతమ్ సవాంగ్ బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ''సెలవు రద్దు చేయాలని నేనే అడిగాను. దాంతో డీజీపీ కూడా వెంటనే రద్దు చేశారు. పండగ సమయంలో కుటుంబ సభ్యులంతా ఆస్ట్రేలియాలో కలవాలని అనుకున్నాం. కానీ కేసు తీవ్రత చూసిన తర్వాత, ప్రజలంతా కూడా నన్ను ఉండాలని ఒత్తిడి చేయడంతో సెలవు రద్దుచేసుకున్నాను. ఇందులో రాజకీయం ఏమీ లేదు, ఒత్తిళ్లు కూడా లేవు. చాలా రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే మేం మాత్రం ఈ కేసును వ్యవస్థాగతంగా, లాజికల్‌గా విచారణ చేస్తున్నాం. తొందర పడటం లేదు. ఏరకమైన ఒత్తిడి కూడా లేదు. రాజకీయం కూడా ఏమీ లేదు. దయచేసి అలాంటి మాటలు తీసుకురావద్దు. కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. అది పూర్తయ్యేవరకు దీని గురించి మాత్రం ఏమీ చెప్పలేను. ఈ కేసులో మోసం, ఎక్స్‌టార్షన్, అన్నీ ఉన్నాయి. డాక్యుమెంట్లు తీసుకోవడం, ఖాళీ పత్రాల మీద సంతకాలు తీసుకోవడం తగదు. సీపీ కార్యాలయం గేటు దగ్గరకు చాలా మంది వస్తున్నారు. ఇది పెద్ద సమస్య. దీన్ని తప్పకుండా పరిష్కరిస్తాం. ఇందులో పెద్ద మొత్తాలు ఉన్నాయి కాబట్టి ఆదాయపన్ను శాఖ అధికారులకు కూడా విషయం చెప్పాల్సి ఉంటుంది'' అని సీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు.


వాస్తవానికి సీపీ గౌతమ్ సవాంగ్ గత వారం రోజులుగా ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. ఎంత పెద్దవాళ్లయినా వదిలిపెట్టేది లేదని ఆయన చెబుతూ వస్తున్నారు. టీడీపీ నాయకుల గుట్టును రట్టు చేశారు. ఇంతలో అకస్మాత్తుగా ఆయన సెలవు విషయం బయటకు వచ్చింది. ఈనెల 27న తాను మళ్లీ విధుల్లో చేరుతానని చెప్పారు. పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి.

కేసును తప్పుదోవ పట్టించేందుకే సవాంగ్‌ను సెలవులో పంపారని ఆరోపణలు వచ్చాయి. వీటిని డీజీపీ జేవీ రాముడు, స్వయంగా గౌతమ్ సవాంగ్ కూడా ఖండించినా, కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నవాళ్లు మాత్రం ఇది బలవంతపు సెలవేనని అనడంతో.. తప్పనిసరి పరిస్థితులలో ఆయన సెలవు రద్దయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement