
చందాలకు.. దందాలొద్దు
పెద్దఎత్తున వినాయక చవితి వసూళ్లు
దౌర్జన్యం చేస్తే చర్యలు తప్పవంటున్న పోలీసులు
నెల్లూరు: వినాయకచవితి ఉత్సవాల పేరిట జిల్లాలో చందాల వసూళ్లు జోరందుకున్నాయి. పండగకు రెండురోజులు మాత్రమే ఉంది. దీంతో ఉత్సవ కమిటీలు బృందాలుగా ఏర్పడి చవితి చందాలను భారీగా వసూలు చేస్తున్నారు. చందాలు అడిగే పద్ధతి అభ్యర్థనగా ఉండటం లేదు. కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చేతిలో ఒక పుస్తకం, రసీదు బుక్ పట్టుకుని ఇంటింటికి వెళుతున్నారు. ఇంకా జీతాలు రాలేదని మళ్లీ రండి అని చెప్పిన వారి పట్ల బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారు. మీ వద్దకు మళ్లీ...మళ్లీ రావాలా? అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. 20 నుంచి 30 అడుగల ఎత్తు ఉండే విగ్రహాలు పెడుతున్నామని అవి కొనుగోలు చేయాలంటే రూ. 50వేలు అవుతాయని, చందా ఎక్కువగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అంత ఇవ్వలేమని అంటే దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది. ఒక్కో వీధికి రెండు, మూడు బృందాలు కూడా వసూళ్లకు వెళుతున్నాయి. అదేమని అడిగితే వీధి చివర వినాయకుడిని ప్రతిష్టించామని ఒక బృందం, వీధి ప్రారంభం వద్ద ప్రతిష్టించనున్నామని మరో బృందం చెబుతోంది. ఒక విగ్రహం ఏర్పాటు చేస్తే చాలదా.. అని ప్రశ్నిస్తే వారితో తమకు విబేధాలున్నాయని కలిసి పనిచేయలేమని చెబుతున్నారు. ఈసారి ఆ గ్రూపుకన్నా పెద్ద విగ్రహం పెట్టి ఘనంగా జరుపుతామని దీంతో భారీగా చందా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మరికొంతమంది గతంలో మూడురోజులు చేశామని ఈఏడాది ఐదురోజులు చేస్తున్నామని చందా ఎక్కువగా ఇవ్వాలని అడుగుతున్నారు. ఒక్కో ఇంటికి కనీసం రూ.100 నుంచి రూ.1,000 వరకు వసూళ్లు చేస్తున్నారు. దుకాణమైతే వెయ్యి నుంచి రూ. 5 వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. వసూలు చేసిన డబ్బులకు లెక్కలుండవు. ఎవరి జేబులు నిండుతున్నాయనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ప్రతి ఇంటిలో పండుగ చేసుకోవడానికి కనీసం రూ. 500 నుంచి రూ. 1000 ఖర్చవుతుంది. ఘనంగా చేసుకోవాలనుకునే వారు మరింత ఎక్కువ ఖర్చుపెట్టుకుంటున్నారు. ఇచ్చిన వారి దగ్గర చందా తీసుకొంటే మంచిది, ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతుండటంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.
-నగరంలోని ఆచారివీధిలో రాజు నివసిస్తున్నాడు. ఆయన కొరడా వీధిలో బంగారు పనిచేసుకొని జీవనం సాగిస్తున్నాడు. కొరడా వీధిలో కొందరు వినాయకచవితి నిర్వహిస్తున్నామని అతని వద్దకు వచ్చారు. చందా ఇవ్వాలని కోరారు. రాజు రూ.100 ఇస్తుండగా రూ. 1000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో రాజు వారు అడిగినంత ఇచ్చారు.
-మూలాపేటకు చెందిన నాగరాజును వినాయకచవితి చందా ఇవ్వాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. తాను రూ.116 ఇచ్చారు. వారు రూ. 516 ఇవ్వాలని కోరారు. తన వద్ద లేవని చెప్పినప్పటికి వారు వినిపించుకోలేదు.
బలవంతం చేస్తే చర్యలు: ఎస్ మగ్బుల్, నగర డీఎస్పీ
ప్రజలకు ఇబ్బంది కల్గకుండా వారు ఎంత ఇస్తే అంతే చందా తీసుకోవాలి. అలాకాకుండా బలవంతంగా వసూళ్లు చేస్తే కఠినచర్యలు తప్పవు. ఎవరైనా బలవంతపు వసూళ్లకు పాల్పడితే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఉత్సవ కమిటీలు ఈవిషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఉత్సవాల పేరిట అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే చర్యలు తప్పవు.