స్వీట్ రివెంజ్‌పై కోహ్లి ఉక్కిరిబిక్కిరి!
భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ జట్టును చిత్తుచేసి.. టెస్టు సిరీస్‌ను 4-0 తేడాతో చేజిక్కించుకోవడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. జట్టు నుంచి తాను ఇంతకుమించి ఏమీ కోరలేదని, ఇంతకన్నా అపూర్వం మరొకటి ఉండదని సంతోషం వ్యక్తం చేశాడు. నిజానికి ముంబైలో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ను ఓడించడం ద్వారా భారత్ టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయినా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఐదో టెస్టులో అసాధారణరీతిలో ఆడి.. ఇంగ్లిష్ జట్టును చిత్తుగా మట్టికరిపించింది. ఐదు టెస్టుల సిరీస్‌ను 4-0తో సొంతం చేసుకోవడం ద్వారా ఇంగ్లిష్ జట్టుపై భారత్ స్వీట్ రివెంజ్ తీర్చుకున్నట్టు అయింది. ఇప్పటివరకు ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వరుస సిరీస్‌లలో భారత్‌కు పరాభవమే మిగిలింది. 2011, 2012, 2014లలో జరిగిన టెస్టుసిరీస్‌లలో ఆ జట్టుదే గెలుపు. ఈ నేపథ్యంలో భారత్‌కు లభించిన ఈ మధురవిజయంపై కెప్టెన్ కోహ్లి హర్షం వ్యక్తంచేశాడు.
'ఇంతకుమించి నేనేమీ అడిగి ఉండను. నిజానికి 3-0తో సిరీస్‌ను గెలుచుకున్నప్పటికీ ఈ స్థాయిలో విజయం సాధించడమంటే మాటలు కాదు. ఇది జట్టు వ్యక్తిత్వానికి నిబద్ధతకు నిదర్శనం. దేశం కోసం ఆడేందుకు ఆటగాళ్లు ఎంతగా సన్నద్ధమయ్యోరో ఇది చాటుతోంది' అని మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ కార్యక్రమంలో కోహ్లి ఆనందం వ్యక్తం చేశాడు. మొదటి రెండు టెస్టుల్లో అంతగా ఆడకపోయినా ఈ టెస్టులో కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ అద్భుతంగా రాణించారని కోహ్లి కితాబిచ్చారు.
టాస్ ఓడిపోయి.. మొదటి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టుకు భారీ పరుగులు సమర్పించుకున్నా.. తిరిగి ఎదురుదాడితో ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం అసాధారణమని కోహ్లి ప్రశంసల జల్లు కురిపించారు. ఐదో టెస్టులో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు 477 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బరిలోకి వచ్చిన టీమిండియా కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ, కేఎల్ రాహుల్ 199 పరుగులతో రాణించడంతో అద్భుతమైనరీతిలో 759 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లిష్ టీమ్ ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.