ఘనమైన ముగింపుపై భారత్ దృష్టి
నేటి నుంచి ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు
ఉదయం గం.9:30 నుంచి స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం
భారత జట్టు హైదరాబాద్‌లో తొలి టెస్టును కోల్పోయిన తీరు చూస్తే నాలుగో టెస్టు ముగిసే సరికి మన జట్టు సిరీస్ గెలుచుకోగలదని ఎవరూ ఊహించలేదు. తర్వాతి మూడు టెస్టుల్లోనూ ఇంగ్లండ్ మెరుగ్గానే ఆడినా, వెనుకబడిన ప్రతీసారి కోలుకుంటూ టీమిండియా వరుస విజయాలు అందుకుంది. ఇప్పుడు సిరీస్ సొంతం కావడంతో చివరి మ్యాచ్‌నూ గెలిచి ఘనంగా ముగించాలని రోహిత్ బృందం భావిస్తుండగా... సిరీస్ ఓడినా మరో మ్యాచ్ గెలిచి అంతరాన్ని 2–3కు తగ్గిస్తూ స్వదేశం వెళ్లాలని స్టోక్స్ జట్టు పట్టుదలగా ఉంది.
ధర్మశాల: భారత గడ్డపై ఇంగ్లండ్ ఆడిన గత రెండు టెస్టు సిరీస్‌లను టీమిండియా 4–0తో, 3–1తో గెలుచుకుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే 3–1తో పైచేయి సాధించింది. ఈ నేపథ్యంలో సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టుకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఆఖరి సమరంలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న భారత్ సిరీస్‌ను 4–1తో ముగిస్తుందా లేక తాము నమ్ముకున్న ‘బజ్‌బాల్’తో ఇంగ్లండ్ రెండో విజయాన్ని అందుకుంటుందా అనేది ఆసక్తికరం.
బుమ్రా వచ్చేశాడు
సిరీస్ గెలుచుకున్న ఉత్సాహంతో భారత శిబిరంలో ప్రస్తుతం ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ఆటగాళ్లంతా మరోసారి సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓపెనర్లు రోహిత్, యశస్విలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. సిరీస్‌లో ఇప్పటికే 655 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్‌ను నిలువరించడం ఇంగ్లండ్ వల్ల కావడం లేదు. ఒక్క రజత్ పటిదార్ మాత్రమే ఇప్పటి వరకు విఫలమయ్యాడు.
6 ఇన్నింగ్స్‌లలో కలిపి 63 పరుగులే చేసినా... అతనికి మరో మ్యాచ్‌లో అవకాశం దక్కుతోంది. గత టెస్టులో విఫలమైన సర్ఫరాజ్ ఈసారి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. కీపర్ ధ్రువ్ జురేల్ రాంచీ టెస్టుతోనే తానేంటో చూపించగా... జడేజా, అశ్విన్ ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా తన 100వ టెస్టు ఆడనున్న అశ్విన్ ఈ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలని భావిస్తున్నాడు.
నాలుగో టెస్టుకు దూరంగా ఉన్న బుమ్రా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతుండటంతో మన పేస్ మరింత పటిష్టంగా మారింది. సిరాజ్‌తో పాటు గత మ్యాచ్‌లో రాణించిన ఆకాశ్‌దీప్‌కు మూడో పేసర్‌గా అవకాశం ఇస్తారా లేక మూడో స్పిన్నర్‌గా కుల్దీప్‌ను ఎంచుకుంటారా అనేది మ్యాచ్ రోజే తేలుతుంది.
రాబిన్సన్ స్థానంలో వుడ్
ఇంగ్లండ్ తుది జట్టులో ఒకే ఒక మార్పు చోటు చేసుకుంది. బౌలింగ్‌లో పెద్దగా ఆకట్టుకోకపోవడంతో పాటు వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న రాబిన్సన్ స్థానంలో మార్క్ వుడ్‌కు ఇంగ్లండ్ చోటు కల్పించింది. తన 187వ టెస్టు బరిలోకి దిగేందుకు సిద్ధమైన సీనియర్ అండర్సన్ 700 వికెట్ల మైలురాయికి మరో రెండు వికెట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా ఇంగ్లండ్ ఇద్దరు స్పిన్నర్లు హార్ట్‌లీ, బషీర్‌లను ఎంచుకుంది.
అయితే బ్యాటింగే ఆ జట్టును ఇబ్బంది పెడుతోంది. ప్రతీ ఒక్కరు సిరీస్‌లో ఒక్కో సమయంలో రాణించినా సమష్టిగా ఆడకపోవడం వరుస ఓటములకు కారణమైంది. ఓపెరన్లు క్రాలీ, బెన్ డకెట్‌లతో పాటు పోప్ రాణించాల్సి ఉంది.
జో రూట్ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం కాగా కెప్టెన్ బెన్ స్టోక్స్ తన స్థాయికి తగినట్లుగా ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. సిరీస్‌లో ఇప్పటి వరకు విఫలమవుతూనే ఉన్న బెయిర్‌స్టో తన 100వ టెస్టులోనైనా ఆకట్టుకుంటాడా లేదా వేచి చూడాలి.
1 ధర్మశాల స్టేడియంలో ఇప్పటి వరకు ఒకే ఒక టెస్టు జరిగింది. 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది.
పిచ్, వాతావరణం
ధర్మశాలలో చల్లటి వాతావరణం, పిచ్ సీమ్ బౌలింగ్‌కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అయితే దాని ప్రభావం కొద్ది సేపే ఉండవచ్చు. పచ్చిక దాదాపుగా తొలగించడంతో బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment