80% వరకూ తగ్గిన వొడాఫోన్ డేటా చార్జీలు
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ ఆపరేటర్ వొడాఫోన్ ఇండియా డేటా రేట్లను 80 శాతం వరకూ తగ్గించింది. తమ వినియోగదారులకు ఇది దీపావళి బొనాంజా అని కంపెనీ గురువారం తెలిపింది. ఈ తగ్గింపు రేట్లు దేశవ్యాప్తంగా నేటి (శుక్రవారం) నుంచే అమల్లోకి వస్తాయని వివరించింది. ఈ ఏడాది జూన్‌లో కర్ణాటక, పశ్చిమ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, సర్కిళ్లలో 10 కేబీ డేటా చార్జీలను 10 పైసల నుంచి 2 పైసలకు తగ్గించామని పేర్కొంది. ఇప్పుడు ఈ తగ్గింపు రేట్లనే దేశమంతటా అమలు చేస్తామని వివరించింది. ప్రి-పెయిడ్, పోస్ట్-పెయిడ్ వినియోగదారులకు 2జీ నెట్‌వర్క్‌పై పే యాజ్ యు గో ప్రాతిపదికన ఈ తగ్గింపు డేటా చార్జీలు వర్తిస్తాయని పేర్కొంది. వినియోగదారు లు రోమింగ్‌లో ఉన్నప్పటికీ ఈ తగ్గింపు రేట్లు వర్తిస్తాయని వివరించింది. పే యాజ్ యు గో ఆఫర్‌లు 2జీ, 3జీ నెట్‌వర్క్‌లకు సంబంధించి దేశంలోనే అత్యంత చౌక ధరలని కంపెనీ పేర్కొంది.
సెజ్‌లలో తయారీ ప్లాంట్ల నిబంధనలు సడలింపు
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ళ (సెజ్) నుంచి ఎగుమతులను ప్రోత్సహించే దిశగా వీటిలో తయారీ ప్లాంట్లకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సడలించింది. భారీ తయారీ యూనిట్లు ఇకపై మూడేళ్ల దాకా పనులను బైటి యూనిట్లకు సబ్-కాంట్రాక్టు ఇచ్చే వెసులుబాటు కల్పించింది. ఇప్పటిదాకా ఈ వ్యవధి ఏడాది కాలం పాటు మాత్రమే ఉంది. నాలుగేళ్లలో కనీసం రెండేళ్ల పాటు సగటున రూ. 1,000 కోట్ల ఎగుమతులు చేసిన తయారీ యూనిట్లకు మాత్రమే తాజా వెసులుబాటు వర్తించనుంది. అలాగే, సదరు యూనిట్లపై ఎటువంటి ఉల్లంఘన ఆరోపణలు, జరిమానాలు ఉండకూడదు. ఇక సబ్‌కాంట్రాక్టు పొందబోయే డొమెస్టిక్ టారిఫ్ ఏరియా (డీటీఏ) యూనిట్.. కచ్చితంగా సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో రిజిస్టర్ అయి ఉండాలి. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, కనీస ప్రత్యామ్నాయ పన్ను విధింపు వల్ల సెజ్‌లు ఆకర్షణ కోల్పోతున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంత రించుకుంది.