
వచ్చేనెల 21న వరంగల్ ఉప పోరు
- షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
- ఈ నెల 28న నోటిఫికేషన్..
- వచ్చేనెల 24న ఓట్ల లెక్కింపు
- బుధవారం నుంచే ఎన్నికల కోడ్
- 23న సీఎం కేసీఆర్ ఓరుగల్లు పర్యటన రద్దు!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 28న నోటిఫికేషన్ జారీకానుంది. వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. వచ్చే నెల 21న పోలింగ్ జరగనుంది. 24న ఓట్ల లెక్కింపు ప్రారంభించి, పూర్తికాగానే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. 2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన కడియం శ్రీహరి.. 2015 జనవరిలో రాష్ట్ర మంత్రివర్గంలో చేరారు. జూన్‌లో ఆయన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో.. ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
వరంగల్‌తోపాటు మధ్యప్రదేశ్‌లోని రట్లాం లోక్‌సభ స్థానానికి, ఆరు రాష్ట్రాల్లోని ఆరు శాసనసభ స్థానాల్లో ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ జారీచేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానాన్ని ఈ షెడ్యూలులో చేర్చలేదు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి ఆగస్టు 25న మరణించడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలతో బుధవారం నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో శుక్రవారం జరగాల్సిన కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటన రద్దుకానుంది.
షెడ్యూల్ ఇదీ..
అక్టోబర్ 28 : ఎన్నికల నోటిఫికేషన్
నవంబర్ 4 : నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
నవంబర్ 5న : నామినేషన్ల పరిశీలన
7వ తేదీ వరకు : నామినేషన్ల ఉపసంహణ గడువు
నవంబర్ 21న : పోలింగ్
నవంబర్ 24న : ఓట్ల లెక్కింపు