
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపులో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం అందరికంటే ముందుగా తేలిపోనుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. కర్నూలు నియోజకవర్గంలో అత్యధికంగా 33 రౌండ్లు పూర్తి చేయాల్సి ఉన్నందున ఫలితం చివరన వెలువడే అవకాశముంది. పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 30 రౌండ్లకుపైగా పట్టే అవకాశం కనిపిస్తోంది.
జిల్లాల్లో చిత్తూరు ఫలితం ముందుగా..
సాధారణంగా కౌంటింగ్ హాళ్లలో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఈసారి ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తి చేసేందుకు కౌంటింగ్ హాళ్లను బట్టి టేబుళ్ల సంఖ్యను పెంచుకోవడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. చిత్తూరు జిల్లాలో కొన్నిచోట్ల 16 నుంచి 20 వరకు టేబుళ్లను ఏర్పాటు చేశారు. దీంతో అన్నిటి కంటే ముందుగా చిత్తూరు జిల్లా ఫలితాలు వెలువడే అవకాశముంది. మదనపల్లి, పుంగనూరు, చంద్రగిరి, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 టేబుళ్లను సిద్ధం చేయడంతో ఫలితాలు వేగంగా వెలువడనున్నాయి. కృష్ణా జిల్లా నందిగామలో అత్యల్పంగా 7 టేబుళ్లను ఏర్పాటు చేశారు. చాలా నియోజకవర్గాల్లో 18 నుంచి 24 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది.
ఇలా తెలుసుకోవచ్చు..
ఎన్నికల సరళి, ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఒక రౌండు లెక్కింపు పూర్తి కాగానే ఫలితాలను కౌంటింగ్ కేంద్రం వద్ద మైక్‌లో వెల్లడించడంతోపాటు మీడియా ప్రతినిధులకు కనిపించేలా డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రతి రౌండు ఫలితాలను ‘సువిధ’ యాప్‌లో కూడా అప్‌లోడ్ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఫలితాలను తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను, యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. https:// results. eci. gov. in వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ‘ఓటర్స్ హెల్ప్ లైన్’ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా కూడా ఫలితాల సరళిని తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment