గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న వైఎస్ జగన్
సాక్షి, అమరావతి, గన్నవరం, సాక్షి హైదరాబాద్: ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బుధవారం గన్నవరం విమానాశ్రయంలో పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గురువారం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను తాడేపల్లిలోని తన నివాసం నుంచే ఆయన వీక్షించనున్నారు. జగన్ తన సతీమణి వైఎస్ భారతితో కలసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 6.30 గంటలకు గన్నవరం చేరుకున్నారు. పార్టీ రాజకీయ ప్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఆయన వెంట ఉన్నారు. అనంతరం రోడ్డు మార్గాన తాడేపల్లి చేరుకున్న వారికి పార్టీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎదురేగి స్వాగతం పలికారు. జగన్ రాక సందర్భంగా తాడేపల్లిలోని నివాసం, పార్టీ కార్యాలయ పరిసరాలన్నీ సందడిగా మారాయి. పార్టీ కార్యకర్తలు, మీడియా ప్రతినిధుల కోలాహలం ఎక్కువగా కనిపించింది. జగన్ నివాస పరిసరాల్లో పోలీస్ భద్రతను పెంచడంతోపాటు అదనపు బలగాలను నియమించారు.
ఎయిర్‌పోర్టుకు భారీగా నేతలు, కార్యకర్తల రాక
విమానాశ్రయంలో స్వాగతం పలికినవారిలో వైఎస్సార్ సీపీ మచిలీపట్నం పార్లమెంటరీ అధ్యక్షుడు కొలుసు పార్ధసారధి, పార్టీ రాజకీయ సలహా కమిటీ సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్దనరావు, డివై.దాసు, పార్టీ ఎంపీ అభ్యర్థులు పొట్లూరి వీరప్రసాద్, నందిగం సురేష్, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థులు యార్లగడ్డ వెంకట్రావు, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, చంద్రగిరి యేసురత్నం, కైలే అనిల్‌కుమార్, బొప్పన భవకుమార్ తదితరులున్నారు. జగన్ రాక సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు.
వైఎస్ జగన్‌కు పటిష్ట భద్రత
గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఏపీ పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. జగన్ ‘జడ్’ కేటగిరీ భద్రతలో ఉన్నందున ఆ మేరకు పోలీసు సిబ్బందిని ఇవ్వాలని, ఆయన సంచారానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. జగన్ బుధవారం హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి బయల్దేరేటప్పుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకూ ఈ భద్రతా ఏర్పాట్లు సమకూర్చాలని ఏపీ పోలీసు శాఖకు చెందిన అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(ఇంటెలిజెన్స్) ఈ నెల 21న ఒక సందేశాన్ని తెలంగాణ పోలీసులకు పంపగా, వారు ఆ మేరకు భద్రతా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి తాడేపల్లి నివాసానికి జగన్ చేరుకున్నపుడు, ఆ తరువాత కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమాచారం కోసం ఈ సందేశాన్ని ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుకు కూడా పంపారు.
Comments
Please login to add a commentAdd a comment