తుపాకుల నీడలో కౌంటింగ్‌ | Strong Security During counting of votes in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

తుపాకుల నీడలో కౌంటింగ్‌

Published Thu, May 23 2019 4:31 AM | Last Updated on Thu, May 23 2019 4:31 AM

Strong Security During counting of votes in Andhra Pradesh - Sakshi

కృష్ణా యూనివర్సిటీ వద్ద పోలీస్‌ పహారా

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ అప్రమత్తమైంది. నరాలు తెగే ఉత్కంఠను రేపుతున్న ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను పోలీసు వలయంలో నిర్వహించేలా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏప్రిల్‌ 11న ఎన్నికల రోజున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం కూడా టీడీపీ వర్గీయులు మునుపెన్నడూ లేని రీతిలో గ్రామాలపై దాడులు కొనసాగించారు. రీపోలింగ్‌ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాద్ధాంతం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

మరోవైపు ఈవీఎంలు, వీవీ ప్యాట్ల విషయంలో ఎన్నికల సంఘాన్ని తప్పుపడుతూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా చంద్రబాబు నానా యాగీ చేశారు. తమ నాయకుడి దారిలోనే టీడీపీ శ్రేణులు మరింత దూకుడుగా వ్యవహరించాయి. పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశాలు, టెలికాన్ఫరెన్స్‌ల్లో చంద్రబాబు హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ, ప్రాంతీయ సర్వే సంస్థలు, మీడియా చానళ్లు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని స్పష్టం కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉక్రోశం కట్టలు తెంచుకుంది. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్‌ సమయంలో వివాదాలు చెలరేగే అవకాశం ఉందని నిఘా వర్గాలు గుర్తించాయి. అల్లర్లు, ఘర్షణలు చోటుచేసుకోకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టింది.  

కేంద్ర హోంశాఖ హెచ్చరిక  
కౌంటింగ్‌ సందర్బంగా రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖతో పాటు నిఘా వర్గాలు కూడా బుధవారం హెచ్చరించాయి. అల్లర్లు, ఘర్షణలు జరగకుండా ముందస్తుగా భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా మొత్తం 25,224 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తారని డీజీపీ ఇప్పటికే ప్రకటించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద నాలుగంచెల భద్రత కల్పిస్తున్నారు. సీసీ కెమెరాలు, బాడీ వోర్న్‌ కెమెరాలు, డ్రోన్లు, కమ్యూనికేషన్‌ పరికరాలను వినియోగిస్తున్నారు. వాటిని రాష్ట్ర పోలీస్‌ ప్రధాన కార్యాలయం, జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయాలకు అనుసంధానిస్తున్నారు.  

ర్యాలీలు.. గుంపులపై నిషేధాజ్ఞలు  
ఓట్ల లెక్కింపు కేంద్రాలతోపాటు రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో సీఆర్‌పీసీ 144, పోలీస్‌ యాక్ట్‌ 30 సెక్షన్లు అమల్లోకి తెచ్చారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం, గుంపులు గుంపులుగా జనం ఒక చోట గుమికూడడం, మైక్‌లు వాడటాన్ని నిషేధించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్‌ సెంటర్‌కు కిలోమీటర్‌ దూరం వరకూ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. ముందస్తు చర్యల్లో భాగంగా అనుమానిత వ్యక్తులు, అల్లర్లు సృష్టిస్తారనుకునే వారిని పోలీసులు బైండోవర్‌ చేశారు. రౌడీషీటర్లు, అనుమానితులను పోలీసు కస్టడీలోకి తీసుకుంటున్నారు. కౌంటింగ్‌ సందర్భంగా ఈ నెల 22వ తేదీ రాత్రి నుంచి 24వ తేదీ ఉదయం వరకూ రాష్ట్రంలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.  

చంద్రబాబు, వైఎస్‌ జగన్‌ నివాసాల వద్ద బందోబస్తు  
సీఎం చంద్రబాబు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ అనంతరం చంద్రబాబు, జగన్‌ నివాసాల వద్దకు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉన్నందున పోలీసులు భద్రతను పెంచారు. ఇరువురు నేతల నివాసాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం సమీక్షించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement