వైరల్: బాహుబలి-2 టికెట్ల కోసం అమ్రపాలి
- 350 టికెట్లు బుక్ చేయించిన వరంగల్ అర్బన్ కలెక్టర్
- సోషల్ మీడియాలో వైరల్
హన్మకొండ: విడుదల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ ప్రేక్షకులను బాహుబలి ఫీవర్ ఉర్రూతలూగిస్తోంది. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఆన్ లైన్ టిక్కెట్లను జోరుగా కొనుగోలు చేయగా.. థియేటర్ల ముందు ప్రేక్షకులు భారీగా బారులు తీరారు. ఈ తరుణంలోనే వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాటా ఒక్కరే 350 టికెట్లు బుక్ చేయించడం చర్చనీయంశమైంది. వరంగల్ ఆర్డీవో ద్వారా బాహుబలి-2 సినిమాటికెట్లు బుక్ చేయించారామె. ఇన్ని టికెట్లు ఎందుకు? అని ఆరా తీయగా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి..
గత కొద్ది రోజులుగా వరంగల్ నగరంలో సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అధికారులు, ఉద్యోగులు, ఆర్టిస్టులు అంతా కలుపుకొని సుమారు 300 మంది సుందరీకరణ పనుల్లో భాగం పంచుకుంటున్నారు. వారికి కాస్త ఆటవిడుపుగా ఉంటుందనే ఉద్దేశంతోనే కలెక్టర్ అమ్రపాలి.. అందరికీ కలిపి బాహుబలి-2 టికెట్లు బుక్ చేయించారు. హన్మకొండలోని ఏసియన్ మాల్‌లో 28న వారంతా ఫస్ట్ షో చూడనున్నారు. సమర్థురాలైన అధికారణిగా ప్రశంసలు పొందిన అమ్రపాలి మరోసారి ఇలా వార్తల్లో నిలిచారు.