
ఇతర విభాగాల బాధ్యతల నుంచి రిలీవ్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఇకనుంచి జీహెచ్‌ఎంసీపై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించనున్నారు. ఇప్పటి వరకు ఆమెకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్) ఎండీగా, హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగానూ అదనపు బాధ్యతలున్నాయి.
దీంతో పూర్తిస్థాయిలో జీహెచ్‌ఎంసీపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారనే అభిప్రాయాలున్నాయి. తాజాగా ఆమెను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమిస్తూ ఎంఆర్‌డీసీఎల్ ఎండీ, హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా బాధ్యతల నుంచి రిలీవ్ చేయడంతో రెగ్యులర్ కమిషనర్‌గా ఇక బల్దియాపై పట్టు సాధించనున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి దాకా పలు అంశాల్లో కొందరు అధికారులు ఆమ్రపాలిని తప్పుదారి పట్టించారనే ఆరోపణలు వెలువెత్తాయి.
ఇటీవల కొన్ని విభాగాల్లో బదిలీలు, శేరిలింగంపల్లి జోన్‌లో ఇంజినీర్ల కొట్లాటలో ఒక్కరిపైనే చర్యలు, తదితరమైనవి అందుకు ఊతమిచ్చాయి. ఏళ్ల తరబడిగా సీట్లకు అంటుకుపోయిన వారు కదలకపోవడం.. పేరుకు బదిలీ తప్ప కొందరు అదే ప్రాంతంలో కొనసాగుతుండటం వంటివి అందుకు దృష్టాంతాలు. ఇతర విభాగాల బాధ్యతలున్నందున జీహెచ్‌ఎంసీలోని అన్ని విభాగాల, అన్ని స్థాయిల అధికారులకు తగినంత సమయమిచ్చేందుకు వీలు కాలేదని చెబుతున్నారు.