నారాయణ కాలేజీలో వార్డెన్ ఆత్మహత్య
- ప్రేమ వ్యవహారమే కారణమన్న పోలీసులు
- యాజమాన్యం వేధింపులే అంటున్న సహ ఉద్యోగులు
హైదరాబాద్: నారాయణ కళాశాలల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా అత్తాపూర్ హైదర్‌గూడ నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో ఓ వార్డెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమని పోలీసులు అంటుండగా... యాజమాన్యం వేధింపులే కారణమని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదర్‌గూడలోని నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో వరంగల్ జిల్లా కొత్తగూడకు చెందిన వేముల విష్ణు(27) రెండేళ్లుగా వార్డెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
కాగా, శనివారం రాత్రి ఎవరూ లేని సమయంలో కళాశాలలోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం గమనించిన సిబ్బంది... విషయాన్ని కళాశాల నిర్వాహకులు, పోలీసులకు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విష్ణు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మృతుడి ఫేస్‌బుక్ అక్కౌంట్‌ను పరిశీలించిన పోలీసులు... ‘దిస్ ఈజ్ లాస్ట్ డే.. బాయ్ స్వాతి’ అనే పోస్టును గుర్తించారు. దీన్నిబట్టి అతడి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమనే నిర్ధారణకు వచ్చారు. అయితే... దసరా సెలవుల్లో కూడా పనిభారం మోపి యాజమాన్యం ఒత్తిడి తేవడం వల్లనే విష్ణు ఆత్మహత్య చేసుకున్నాడని సహ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. విషయం తెలియగానే... ఈ కళాశాలలో ఉండే సిబ్బంది వెళ్లిపోయి వారి స్థానంలో వేరే బ్రాంచ్‌కు చెందిన ఉద్యోగులు విధుల్లోకి రావడం, ఇంత జరిగినా ప్రిన్సిపాల్ కాలేజీకి రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.