చుక్క నీటికీ చిక్కే!
ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి లోటుతో తాగునీటి గండం
* ప్రభుత్వానికి నీటి పారుదల శాఖ నివేదిక
* నీటిని సంరక్షించుకునే చర్యలు చేపట్టాలని మున్సిపల్ శాఖకు సూచన
* శ్రీశైలం, సాగర్‌లో డిసెంబర్ తర్వాతి లభ్యత 10 టీఎంసీలు.. అవసరం 31 టీఎంసీలు
* హైదరాబాద్‌కు, నల్లగొండ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో నీటికి కటకటే
* మంజీరా ఎండిపోవడంతో సంగారెడ్డికి, పరిసర గ్రామాలకు నీటి కరువు
* శ్రీరాంసాగర్ ఎండుతుండడంతో కోరుట్ల, జగిత్యాల, మెట్‌పల్లిలకూ తప్పని ఇబ్బంది
* మానేరు నుంచి వరంగల్‌కు నీరు అందే పరిస్థితీ లేదు
* భద్రకాళి చెరువులోనూ అడుగంటిన జలాలు
* ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, నీటిని పొదుపుగా వాడాలని సూచనలు
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో ముందు ముందు తాగునీటికి కటకట తప్పదా.., వేసవిలో చుక్క నీటికోసం అల్లాడాల్సిన పరిస్థితి నెలకొననుందా.., హైదరాబాద్ సహా ప్రధాన పట్టణాలన్నీ దాహంతో గొంతెండిపోవాల్సిందేనా.. ఈ ప్రశ్నలన్నింటికీ సాగునీటి పారుదల శాఖ నేతృత్వంలోని నీటి కేటాయింపుల కమిటీ అవుననే సమాధానమే ఇస్తోంది. వేసవి ప్రారంభం నాటికే జల వనరులన్నీ ఎండిపోయి, తాగునీటికి తీవ్ర కరువు తప్పదని తమ నివేదికలో స్పష్టం చేసింది. వెంటనే ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. దీంతోపాటు పలు సిఫారసులు చేసింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన జంట నగరాలు, నల్లగొండ పట్టణం, పరిసర గ్రామాల్లో తాగునీటి అవసరాలకు 31 టీఎంసీలు అవసరం కాగా... లభ్యత ఉండేది 10 టీఎంసీలేనని నీటిపారుదల శాఖ వర్గాలు వివరించాయి.
కోటిన్నర మందిపై ప్రభావం..
ప్రస్తుత సీజన్‌లో వర్షాభావం నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు తదితర ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ఆందోళనకర స్థితికి పడిపోయాయి. వీటన్నింటిలోనూ ఒక్క శ్రీశైలంలో మాత్రమే తాగునీటిని అందించగలిగే స్థాయిలో లభ్యత జలాలు ఉన్నాయి. ఈ ప్రభావం వచ్చే వేసవిలో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రధాన పట్టణాలపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సాగర్, సింగూరు జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోవడంతో హైదరాబాద్, నల్లగొండ, సంగారెడ్డి ప్రాంతాలకు కటకట తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రభావం కోటిన్నర మందిపై ఉండే అవకాశం ఉంది. ఇదే అంశాన్ని నీటి పారుదల శాఖ ఇటీవల సమీక్షించి... తాగునీటి అవసరాలపై మున్సిపల్ శాఖను అప్రమత్తం చేసింది. ప్రస్తుత లెక్కల మేరకు శ్రీశైలంలో కనీస నీటి మట్టం (ఎండీడీఎల్) 834 అడుగులకు పైన 18.34 టీఎంసీల నీటి లభ్యత ఉంది.
ఎండీడీఎల్‌కు దిగువన 796 అడుగుల దాకా మరో 26.78 టీఎంసీలున్నాయి. మొత్తంగా ఇక్కడ వినియోగించుకునే వీలున్న నీరు 45.13 టీఎంసీలని లెక్కగట్టారు. ఇక సాగర్‌లో 510 అడుగుల కనీస మట్టానికి ఎగువన 1.19 టీఎంసీలున్నాయి. రెండింటిలో కలిపి 46.32 టీఎంసీలు ఉండగా.. ఆవిరి నష్టాలు 8 టీఎంసీల మేర ఉంటాయని అంచనా. అంటే మొత్తంగా లభ్యత జలాలు 38.32 టీఎంసీలేనని లెక్కించారు. ఇందులో డిసెంబర్ వరకు ఏపీ అవసరాలకు 14 టీఎంసీలు, తెలంగాణకు 3 టీఎంసీల మేర వాడుకునేలా కృష్ణా బోర్డు అనుమతినిచ్చింది. ఈ నీరు పోతే మిగిలే జలాలు 21.32 టీఎంసీలే. ఇందులో డిసెంబర్ తర్వాత మళ్లీ ఇరు రాష్ట్రాలకు చెరో 10 టీఎంసీల వరకు కేటాయించే అవకాశముంది. కానీ రాష్ట్ర అవసరాలు మాత్రం అందుకు మూడింతలుగా 31 టీఎంసీల మేర ఉన్నాయి.
అవసరాలు ఇలా..
నాగార్జున సాగర్ కింద తాగునీటి లెక్కలను నీటి పారుదల శాఖ స్పష్టంగా పేర్కొంది. ఏఎమ్మార్పీ నుంచి హైదరాబాద్‌కు 12.12 టీఎంసీలు, న ల్లగొండపట్టణానికి 2.35, జిల్లాలోని 93 చెరువులకు 1.50 టీఎంసీలు, సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న చెరువులకు 1.50 టీఎంసీలు కలిపి మొత్తం 17.47 టీఎంసీల నీరు అవసరమని లెక్కించింది. దీంతో పాటు సాగర్ ఎడమగట్టు కాలువ మిర్యాలగూడ సర్కిల్‌కు 5.40, టేకులపల్లి సర్కిల్‌కు 8.7 టీఎంసీలు కావాలని పేర్కొంది. మొత్తంగా సాగర్ కింద 31 .57 టీఎంసీలు అవసరమని స్పష్టం చేసింది. ఇక హైదరాబాద్ అవసరాలను తీరుస్తున్న మంజీరాలో గత 45 రోజులుగా పంపింగ్ జరుగుతోంది. ఇక్కడ ప్రస్తుతం 0.2 టీఎంసీల నీరే ఉంది. నిజానికి మంజీరా ఆధారిత మంచినీటి పథకాలకు 6.9 టీఎంసీలు అవసరం. ప్రస్తుతమున్న నిల్వలు సంగారెడ్డి, హైదరాబాద్ నగరానికి కేవలం 45 రోజులకే సరిపోతాయి. ఇక సింగూరులోనూ 0.9 టీఎంసీల జలాలే ఉన్నాయి. వీటిని ఒక నెల పాటు సర్దుబాటు చేయవచ్చని... తర్వాతి అవసరాలకు గడ్డు పరిస్థితి తప్పదని నీటి పారుదల శాఖ అంచనా వేసింది.
జాగ్రత్తగా వాడుకోవాలి..
ఎస్సారెస్పీలో 7 టీఎంసీల మేర నిల్వ ఉన్నా ఇక్కడ డెడ్‌స్టోరేజీ 5 టీఎంసీలు. ఇందులో ఆవిరి నష్టాలు 1.13 టీఎంసీలుపోతే లభ్యత ఒక టీఎంసీ లోపే. కానీ ఇక్కడ సుమారు 3 టీఎంసీలు అవసరం. కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల పట్టణాలకు వచ్చే జూలై వరకు ఇక్కడి నుంచే నీటిని విడుదల చే యాల్సి ఉంటుంది. జగిత్యాలకు నీటిని సరఫరా చేసే ధర్మసాగర్ చెరువులో 45 రోజుల అవసరాలకు మించి నిల్వ చేసుకునే వెసులుబాటు లేదు. దీంతో ఈ చెరువు సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. దీంతోపాటు కోరుట్ల రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం కూడా పెంచాలని, ఈనెల 15 వరకు దీనికి నీటిని విడుదల చేయకూడదని పేర్కొన్నారు. ఇక దిగువ మానేరు డ్యామ్ కింద రబీ అవసరాల నేపథ్యంలో... ఈ ప్రాజెక్టు నుంచి వరంగల్‌కు తాగునీటిని సరఫరా చేసే అవకాశం లేద ని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఉన్న నీటినే పొదుపుగా వాడుకోవాలని సూచించింది. దిగువ మానేరుపై ఆధారపడిన సిరిసిల్ల, సిద్ధిపేట, వేములవాడ పట్టణాలకు నీటి సరఫరా కోసం ప్రతి నెలా 0.25 టీఎంసీలు అవసరంకాగా.. ప్రస్తుత నిల్వలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని పేర్కొంది. మానేరులో నిల్వలు డెడ్‌స్టోరేజీకి చేరితే పంపింగ్ ద్వారా నీటిని తోడి కరీంనగర్ నగర అవసరాలను తీర్చాలని సిఫార్సు చేసింది. వరంగల్‌కు నీటిని సరఫరా చేసే భద్రకాళి చెరువులో నీరు అడుగంటిన దృష్ట్యా, గోదావరిపై నెల రోజుల్లో అడ్డుకట్ట నిర్మించి నీటిని తరలించాలని సూచించింది.