పుత్తడిలో పెట్టుబడా? | ways to Investment | Sakshi
Sakshi News home page

పుత్తడిలో పెట్టుబడా?

Published Mon, Mar 28 2016 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM

పుత్తడిలో పెట్టుబడా?

పుత్తడిలో పెట్టుబడా?

ఇన్వెస్ట్‌మెంట్‌కు 5 మార్గాలు
దీర్ఘకాలంగా చూస్తే 10శాతం లోపు రాబడి
దీర్ఘకాలానికైతే ఏదైనా సరైన సమయమే

 

కష్టపడి సంపాదించిన డబ్బును దేంట్లోనైనా ఇన్వెస్ట్ చేద్దామంటే సవాలక్ష సందేహాలొస్తాయి. బంగారంపై నమ్మకమున్నా రేట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్న నేపథ్యంలో దీనిపైనా సందేహాలు సహజం. ఇలాంటి వాటిని కొంత వరకూ నివృత్తి చేసే ప్రయత్నమే ఈ కథనం. 

 

పసిడిలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రధానంగా రెండు కారణాలుంటాయి. మొదటిదేంటంటే.. ఇది పెరిగే ధరల బారి నుంచి కాపాడుకోవడానికి మంచి హెడ్జింగ్ సాధనం. అనేక సంవత్సరాలుగా చూస్తే ద్రవ్యోల్బణం రేటుకు దీటుగా పసిడి రాబడులందించింది. రెండో కారణానికొస్తే... షేర్లకు వ్యతిరేక దిశలో పసిడి రాబడుల తీరుంటుంది. ఉదాహరణకు కొన్నేళ్ల క్రితం అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ సమయంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలినప్పుడు పుత్తడి రేట్లు భారీగా పెరిగాయి. కాబట్టి మన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో రిస్కు తగ్గించుకునేందుకు, వైవిధ్యం పాటించేందుకు మరో సాధనంగా బంగారం ఉపయోగపడుతుంది.

 
పసిడిలో పెట్టుబడులు లాభమేనా?

2006- 2011 మధ్య బంగారం గణనీయమైన లాభాలందించింది. ఆ వ్యవధిలో సగటున ఏటా 29 శాతానికిపైగా రిటర్నులు ఇచ్చింది. ఏ ఇతర పెట్టుబడి సాధనంతో పోల్చినా ఇది ఎక్కువే. అయితే ఒకటి! దీర్ఘకాలికంగా చూస్తే మాత్రం పసిడి పెట్టుబడులపై రాబడి సగటున వార్షికంగా 10 శాతం కన్నా తక్కువే ఉంది. సరే.. ఇవన్నీ పరిశీలించాక కూడా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయదల్చుకుంటే ..  చూసుకోతగిన అంశాల్లో కొన్ని ఇవి.

 
ఆభరణాలు ..

సంప్రదాయ పద్ధతుల్లో బంగారు ఆభరణాలు, నాణేలు, కడ్డీలు కొనొచ్చు. అయితే, ఆభరణాల్లో కొన్ని ప్రతికూలతలున్నాయి. బంగారంతో పాటు మేకింగ్ చార్జీలూ కట్టుకోవాలి. ఒక్కోసారి మొత్తం ఖరీదులో మేకింగ్ చార్జీల భాగమే పది శాతం నుంచి ఇరవై శాతం దాకా ఉంటోంది. అయితే, అదే ఆభరణాన్ని అదే జ్యుయలర్‌కి మళ్లీ అమ్మజూపితే మాత్రం దాని మొత్తం ధర నుంచి మేకింగ్ చార్జీలు వగైరా అన్నీ తీసేసి మార్కెట్ రేటుకన్నా తక్కువే లెక్క కడుతుంటారు.

 

ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు..
మొత్తం పోర్ట్‌ఫోలియో విలువలో సుమారు 5 శాతం నుంచి 10 శాతం దాకా గోల్డ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. మరీ ఎక్కువైతే మాత్రం ఒకటి ఆలోచించాలి. ముందే చూశాం కదా.. దీర్ఘకాలంలో పసిడిపై రాబడులు పది శాతం కన్నా తక్కువే ఉంటున్నాయి. బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి సరైన సమయమంటూ లేదు. కనీసం అయిదేళ్ల పాటైనా ఇన్వెస్ట్ చేస్తే ప్రయోజనం ఉండగలదని అంచనా. కాబట్టి షరా మామూలుగా రిస్కులన్నీ బేరీజు వేసుకుని అనువైన సాధనాన్ని ఎంచుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు.

 

గోల్డ్ ఈటీఎఫ్ ..
మ్యూచువల్ ఫండ్ల తరహాలోనే బంగారంలో పెట్టుబడులకు గోల్డ్ ఎక్క్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్‌లంటూ ఉన్నాయి. ఇవి మన దగ్గర సమీకరించే నిధులను గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. మనకు యూనిట్ల కింద కేటాయిస్తాయి. ఈ ఫండ్‌లు స్టాక్ ఎక్క్ఛేంజీలో కూడా ట్రేడవుతుంటాయి. షేర్లు కొనుక్కున్నట్లే డీమ్యాట్ అకౌంటు, ట్రేడింగ్ అకౌంటు తీసుకుని ఎలక్ట్రానిక్ రూపంలో వీటి ద్వారా పసిడిని కొనుగోలు చేయొచ్చు.  కొనడం, అమ్మడానికి సంబంధించి కొంత బ్రోకరేజి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జీల్లాంటివి కూడా ఉంటాయి.

 

బంగారం నాణేలు, కడ్డీలు..
ఆభరణాలతో పోలిస్తే వీటిలో ఇన్వెస్ట్ చేయడం కొంత మెరుగైన పద్ధతి. పసిడి కడ్డీలు, నాణేలను బ్యాంకుల కంటే జ్యుయలర్ల నుంచి కొనుక్కోవడమే ఉత్తమం. ఎందుకంటే బ్యాంకులు.. కాయిన్లు, కడ్డీలు అమ్మడమే తప్ప మళ్లీ కొనవు. అదే జ్యుయలర్లయితే మనకు అమ్మడంతో పాటు మన దగ్గర నుంచి కూడా కొంటారు.

 
గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్

ఇవి ఇన్వెస్టరు తరఫున గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటి ద్వారా బంగారంలో పెట్టుబడులు పెట్టాలంటే డీమ్యాట్ అకౌంటు వంటి బాదరబందీ ఏమీ ఉండదు. సాధారణ మ్యూచువల్ ఫండ్ స్కీముల్లానే బంగారంలోనూ సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసే వీలుంటుంది. అయితే, ఫండ్ ఆఫ్ ఫండ్ ద్వారా చేసే పెట్టుబడి కాస్తఖరీదైన వ్యవహారమే. మనం కొన్న గోల్డ్ ఈటీఎఫ్‌లకు సంబంధించి వార్షిక మేనేజ్‌మెంట్ చార్జీలు కట్టాలి. అలాగే గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్ స్కీముకు కూడా ప్రత్యేకించిన వార్షిక మేనేజ్‌మెంట్ చార్జీలు కట్టాల్సి వస్తుంది.

 
గోల్డ్ ఈటీఎఫ్‌లు.. గోల్డ్ ఫండ్లకు మధ్య కొన్ని వ్యత్యాసాలున్నాయి. ఈటీఎఫ్‌ల విషయానికొస్తే.. డీమ్యాట్ అకౌంటు ఉండాలి, బ్రోకింగ్ చార్జీలు కట్టాలి. అదే గోల్డ్ ఫండ్స్‌లోనైతే అదనంగా గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్ నిర్వహణ చార్జీలు కూడా కట్టాల్సి వస్తుంది. తక్కువ పరిమాణంలో కొంటున్నప్పుడు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. అదే ఎక్కువ పరిమాణం కొంటున్నప్పుడు బ్రోకరేజీ చార్జీల విషయంలో బేరమాడుకునే వీలుండటంతో ఈటీఎఫ్‌లను ఎంచుకోవచ్చు.

 
ఈక్విటీ ఆధారిత గోల్డ్ ఫండ్స్..

ఈ ఫండ్లు నేరుగా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయవు. కానీ బంగారం మైనింగ్, ఉత్పత్తి, మార్కెటింగ్ మొదలైన కార్యకలాపాలున్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. దీని విషయానికొస్తే.. ఆయా ఫండ్ హౌస్ నిర్వహణ, అవి ఇన్వెస్ట్ చేసే కంపెనీల మీద మన పెట్టుబడులపై రాబడులు ఆధారపడి ఉంటాయి.అదే మిగతా నాలుగు సాధనాలను తీసుకుంటే.. బంగారం ధరల హెచ్చుతగ్గులపై రాబడి ఆధారపడి ఉంటుంది. అత్యధిక రిస్కు సామర్థ్యం ఉన్న వారు ఈ తరహా ఈక్విటీ ఆధారిత గోల్డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ఎందుకంటే ఇవి షేర్లపై ఆధారపడి ఉంటాయి. షేర్లలో ఉండే రిస్కులు వీటికీ ఉంటాయి. పసిడిలో పెట్టుబడులకు అందుబాటులో ఉన్న సాధనాలన్నింటినీ పోల్చి చూస్తే..  గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఫండ్‌లు కాస్త సురక్షితమైనవిగా, లాభదాయకమైనవిగా చెప్పవచ్చు.



ఇప్పట్లో పెరగకపోవచ్చు!

 

పసిడి ధరపై నిపుణుల అంచనా
న్యూయార్క్/ ముంబై: అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో... పసిడి స్వల్పకాలంలో భారీ పెరుగుదల ఏమీ ఉండకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మార్కెట్ల కదలికలు జాగ్రత్తగా పరిశీలిస్తున్న ఇన్వెస్టర్లు.. పసిడి విషయంలో వేచిచూసే ధోరణిని అవలంభించే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వరుసగా మూడవ వారమూ పసిడి దిగువచూపు చూసింది. భారీ స్థాయిలో పెరిగిన ధర నుంచి లాభాల స్వీకరణ దీనికి కారణంగా పేర్కొంటున్నారు. న్యూయార్క్ నెమైక్స్ ట్రేడ్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఏప్రిల్ డెలివరీ పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర వారం వారీగా దాదాపు 30 డాలర్లు తగ్గి 1,222 డాలర్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ ధోరణికితోడు దేశీయంగా డిమాండ్ తగ్గడం, సీజనల్ కొనుగోళ్ల మందగమనం వంటి అంశాలు దేశీయంగా బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ  నేపథ్యం కూడా దేశీయంగా ఈ వారంలో పసిడి నష్టాలకు కారణమైంది. దేశీయ స్టాకిస్టులు వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారని, పసిడి సమీపకాలంలో మరికొంత వెనకడుగే వేసే అవకాశం ఉందని ఒక ట్రేడర్ అభిప్రాయపడ్డారు.  దేశీయంగా ప్రధాన పసిడి బులియన్ స్పాట్ మార్కెట్‌లో ముంబైలో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.400 తగ్గి, రూ. 28,510 వద్ద ముగిసింది.

 

 కె.వి.సనిల్ కుమార్
హెడ్ (సేల్స్ విభాగం), జియోజిత్ బీఎన్‌పీ పారిబా

 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement