కొత్త నోట్ల పర్సుల సంచలనం...?
ముంబై: పెద్ద నోట్ల రద్దుతో దేశంలో కరెన్సీ సంక్షోభం ఒకవైపు కొనసాగుతుండగానే చైనా అప్పుడే రంగంలోకి దిగిపోయింది. ఆగండాగండి.. చైనా రంగంలోకి దిగిపోయింది..అంటే నకిలీ కరెన్సీతోనో.. నగదు మార్పిడికోసమో కాదు. కొత్త కరెన్సీ నోట్లకోసం ఆశగా ఎదురు చూస్తున్న భారతీయుల మనసు దోచుకునేందుకు చైనా తన మార్కెటింగ్ టెక్నిక్ ను మరోసారి బాగా వాడేసింది. దేశంలో చైనా వస్తువులను నిషేధించాలన్న వాదనలు కొనసాగుతుండగానే .. మన కొత్త రూ.500 రూ.2000 నోట్ల డిజైన్ తో పర్సులు మార్కెట్లలో దర్శనమివ్వడం ఆసక్తికరంగా మారింది.
చవక వస్తువులతో దేశీయ వినియోగదారులను, మార్కెట్ ను కొల్లగొడుతున్న చైనా దేశీయ కొత్త కరెన్సీని పోలిన మహిళల వాలెట్స్ ను వినూత్నంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక్క పక్క దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో నగదు కొరతతో ప్రజలు అష్ట కష్టాలుపడుతోంటే.. రూ.2000, రూ.500 నోట్లను పోలిన డిజైన్ తో వాలెట్స్ ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు మనం దేశం నోట్ల ముద్రణకు ఇబ్బందులు పడుతోంటే.. చైనా మాత్రం అపుడే పర్సులను రెడీ చేసిందన్న కమెంట్లు వెల్లువెత్తాయి.
కాగా రూ.500 రూ.1000 నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై పలురంగాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతుండగా... ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో పెద్దనోట్ల రద్దుపై శీతాకాల పార్లమెంట్ సమావేశాలు అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.