అంచనాలను అందుకోవడం సర్కారుకు పెనుసవాలే!
న్యూఢిల్లీ: దేశ ప్రజల అంచనాలను అందుకోవడం నరేంద్రమోడీ ప్రభుత్వానికి పెనుసవాలే అని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. అనేక ఆకాంక్షలతో ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, ఇకవారు వేచి చూసే అవకాశం లేదని, వారి ఆకాంక్షలను త్వరితగతిన నెరవేర్చాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ మహిళా విభాగం సమావేశంలో ఆమె ప్రసంగించారు. ‘మనం ఎక్కువ ఓట్లు సాధిస్తే.. మనపై బాధ్యత కూడా పెరుగుతుంది. మనం ఈ స్థాయికి రావడానికి పదేళ్లు తీవ్రంగా శ్రమించాం. ఇప్పుడు ప్రజల అంచనాలను అందుకోవడమే మన ముందున్న అతిపెద్ద సవాలు’ అని సుష్మ అన్నారు. సాధారణంగా మహిళలకు తేలికైన శాఖలను అప్పగిస్తారని, కానీ మోడీ తనను దేశానికి తొలి మహిళా విదేశాంగ మంత్రిని చేశారని ఆయనకు కతజ్ఞతలు తెలిపారు.
ఎన్‌డీఏ పగ్గాలు చేపట్టగానే రాత్రికిరాత్రే అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట పెరిగిందని, వివిధ దేశాల విదేశాంగ మంత్రులు మనదేశంలో పర్యటించారని చెప్పారు. ప్రజల అంచనాలను అందుకునేందుకు అన్ని శాఖల మంత్రులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను గుర్తుచేసేలా మహిళా కార్యకర్తలు గ్రూపులుగా ఏర్పడి ఎప్పటికప్పుడు మంత్రులను అప్రమత్తం చేయాలని, తద్వారా ప్రజల అంచనాలను త్వరగా అందుకోవడానికి వీలుకలుగుతుందని ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్ సూచించారు.