'బిహార్ ప్రజల ఆశాకిరణం ఎన్డీయే'
న్యూఢిల్లీ: బిహార్‌లో వాతావరణం మార్పు దిశగా కనిపిస్తున్నదని, బిహార్ ప్రజలకున్న ఏకైక ఆశాకిరణం ఎన్డీయే అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. బిహార్‌లో నాలుగో దఫా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఆదివారం ట్విట్టర్‌లో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 'ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బిహార్ వాతావరణం చెపుతున్నది. ప్రజలు ఎన్డీయేను ఆశాకిరణంగా చూస్తున్నారు' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
అదేవిధంగా బిహార్‌లోని మధుబని, మాధేపూర, కథియార్ ప్రాంతాలలో ఆయన ఆదివారం ఐదో దఫా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌పై ధ్వజమెత్తారు. బిహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి పట్టం కట్టాలని ప్రజలను కోరారు.