దీన్ని చంపాలా? వద్దా?
లండన్: బ్రిటన్‌లో ఒక కుక్క జీవితం గాలిలో దీపంలా ఉంది. చనిపోయిన యజమానిని తిన్నట్టు భావిస్తున్న సదరు శునకాన్ని హతమార్చాలని పోలీసులు, వద్దని జంతుహక్కుల కార్యకర్తలు వాదిస్తున్నారు. స్టఫోర్డ్‌షైర్ బుల్ టెరీర్ జాతికి చెందిన ఈ తొమ్మిదేళ్ల కుక్క పేరు ‘బస్టర్’ అని, ‘బుచ్’ అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ‘బస్టర్’ సెప్టెంబర్‌లో లివర్‌పూల్‌లో తన యజమాని మృతదేహం వద్ద కనిపించింది. అప్పుడు అది ఆకలితో ఉండడం, మృతదేహంపై గాయాలు ఉండడంతో యజమానిని తిన్నదని భావిస్తున్నారు.
ఆయన మృతికి కుక్క కారణమా, కాదా అన్న విషయంలో దర్యాప్తులో తేలలేదు. ‘బస్టర్’తో ప్రజలకు ముప్పు ఉందని, చంపేయడమే మంచిదని కుటుంబం చెబుతోంది. చంపేందుకు అనుమతివ్వాలన్న పోలీసుల వినతిపై వచ్చే నెల కోర్టు విచారణ జరపనుంది. బస్టర్‌ను చంపొద్దని ఫ్రెష్‌ఫీల్డ్ యానిమల్స్ రెస్క్యూ సెంటర్, జంతుహక్కుల సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. చాలారోజులు ఆకలితో ఉన్న జంతువులు చనిపోయిన వ్యక్తులను తినడం అసాధారణమేమీ కాదని కోర్టులో వాదించనున్నాయి.