హైదరాబాద్పై రెండు మూడు ఆలోచనలు: షిండే
హైదరాబాద్ విషయమై తమ వద్ద రెండు మూడు ప్రతిపాదనలున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండే సూచనప్రాయంగా వెల్లడించారు. రాష్ట్ర విభజన విషయంపై కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకోకపోతే మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ఏపీ ఎన్జీవోలు హెచ్చరించినా.. సీమాంధ్ర 38 రోజులుగా ఉద్యమాల జోరుతో హోరెత్తుతున్నా.. కేంద్ర హోం మంత్రి షిండే మాత్రం మళ్లీ పాత పాటే పాడారు. న్యూఢిల్లీలో శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై హోం శాఖ కేబినెట్ నోట్ తయారు చేస్తోందన్నారు. త్వరలోనే ఈ నోట్ పూర్తవుతుందని తెలిపారు. అఖిల పక్ష సమావేశంలో తెలంగాణపై అన్ని పార్టీల నుంచి ఏకాభిప్రాయం వచ్చిన కారణంగానే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్నామని షిండే తెలిపారు.
ఏకాభిప్రాయంతోనే తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ సీడబ్ల్యూసీ తీర్మానం చేసిందని అన్నారు. సీడబ్ల్యుసీ కూడా తెలంగాణకు ఆమోదం తెలిపిందని చెప్పారు. ఆంటోనీ కమిటీ చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. ఆంద్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించే ప్రసక్తి లేదని, ప్రస్తుతానికి అక్కడ శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని అన్నారు. తెలంగాణపై కేబినెట్ నోట్ తయారైతే అన్ని అంశాలూ పరిష్కారం అవుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారంటూ వస్తున్న వదంతులన్నీ అబద్ధమేనని షిండే స్పష్టం చేశారు.
దేశంలో ప్రత్యేక రాష్ట్రాలకోసం చాలా డిమాండ్లు ఉన్నాయి గానీ, వాటన్నింటినీ అంగీకరించలేమని హోం మంత్రి షిండే తెలిపారు. గూర్ఖాలాండ్, విదర్భ సహా అనేక కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పలు విజ్ఞప్తులున్నాయని, కానీ వాటిని ఇప్పట్లో పరిశీలించలేమని షిండే అన్నారు. అవసరమైనప్పుడు వాటిని కూడా పరిశీలిస్తామన్నపారు. అసోంలో బోడోలు, కుచ్-రాజ్బంగ్షీలు, కర్బీలు, దిమసాలు చాలాకాలంగా తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. గూర్ఖా జనముక్తి మోర్చాకు చెందిన ఓ బృందం తనవద్దకు రావడంతో తాను పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని సంప్రదించేందుకు ప్రయత్నించినా అది కుదరలేదన్నారు.