నేటి కేబినెట్‌ భేటీలో ‘టీ’ లేదు - రేపటి సమావేశంలోనూ రాదు! | Union Cabinet not to discuss Telangana issue on Wednesday and Thursday | Sakshi
Sakshi News home page

నేటి కేబినెట్‌ భేటీలో ‘టీ’ లేదు - రేపటి సమావేశంలోనూ రాదు!

Published Wed, Oct 2 2013 1:55 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

నేటి కేబినెట్‌ భేటీలో ‘టీ’ లేదు - రేపటి సమావేశంలోనూ రాదు! - Sakshi

నేటి కేబినెట్‌ భేటీలో ‘టీ’ లేదు - రేపటి సమావేశంలోనూ రాదు!

విభజన నిర్ణయంతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన కాంగ్రెస్‌ అధిష్టానం రాజకీయ లబ్ధికోసం తమ నాటకాన్ని రక్తికట్టిస్తోంది. కాంగ్రెస్‌ దిగ్గజాలే రోజుకో మాట మాట్లాడుతూ.. కేబినెట్‌ నోట్‌ ఇదిగో అదిగో అంటూ కావాలనే గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నట్టు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంమీద రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా మారేంతవరకు రాష్ట్రాన్ని ఇదే విధంగా అయోమయంలో కొనసాగించడమే ఎజెండాగా ముందుకు కదులుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ అంశంపై కేంద్ర హోంశాఖ రూపొందించే కేబినెట్‌ నోట్‌ కేంద్ర మంత్రిమండలి ముందుకు రాబోతోందంటూ గత కొద్ది రోజులుగా హైడ్రామా నడుపుతున్నారు. ఇంతగా ప్రచారం చేస్తూవచ్చినప్పటికీ బుధ, గురువారాల్లో జరిగే మంత్రివర్గ సమావేశంలోనూ తెలంగాణ నోట్‌ అనేది అసలు ఎజెండాలో చేర్చలేదు. ప్రధానమంత్రి మన్మో„హన్‌సింగ్‌ విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రాగానే అక్టోబర్‌ మొదటి వారంలో కేంద్ర మంత్రివర్గం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎజెండాగా మంత్రిమండలి సమావేశం ఉంటుందని ప్రచారం చేశారు. తీరా మంత్రివర్గం సమావేశం కాబోతోందన్న కొద్ది గంటల ముందు.. ‘ఇప్పుడే అలాంటి నోట్‌ అంటూ ఏమీ లేద’ని కేంద్ర హోంశాఖ తేల్చేసింది.
 
కేంద్ర హోంశాఖ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ ఇచ్చిన కథనం మేరకు బుధ, గురువారాల్లో జరిగే కేబినెట్‌ సమావేశంలో టీ-నోట్‌ ప్రస్తావన ఉండదని తేలిపోయింది. అసలు నోటే సిద్ధంకానప్పుడు కేబినెట్‌ ముందుకు ఎలా వస్తుందని కొత్త వాదన తెరమీదకు తెచ్చారు. కొద్ది రోజుల కిందటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కేబినెట్‌ నోట్‌ ముసాయిదా సిద్ధమైందని స్వయంగా కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటన చేశారు. దాన్ని తానింకా పరిశీలించలేదని, త్వరలోనే పరిశీలిస్తానని కూడా తెలిపారు. గతంలో దిగ్విజయ్‌సింగ్‌ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్రానికి చెందిన ముగ్గురు నేతలను రోడ్‌మ్యాప్‌లు తయారు చేయమనడం, అంతే వేగంగా కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం, ఆ తర్వాత కొద్ది రోజులకు యూపీఏ భాగస్వామ్య పక్షాల భేటీ, వెను వెంటనే సీడబ్ల్యూసీ తీర్మానం.. ఇలా ఒకదాని తర్వాత ఒకటన్నట్టు కాంగ్రెస్‌ త్వరత్వరగా నిర్ణయాలు చేసింది. అప్పుడు ఎంతో వేగంగా వ్యవహారాలు నడిపించి రాష్ట్రాన్ని అయోమయంలో పడేసిన కాంగ్రెస్‌ నాయకత్వం తాజా పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని ప్రతిష్టంభనను తొలగించడానికి గానీ అనిశ్చితికి తెరదించేందుకు గానీ ఏమాత్రం ప్రయత్నాలు చేయకపోగా.. పరిస్థితిని మరింత గందరగోళంలోకి నెడుతోందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
 
కేబినెట్‌ ఎజెండాలో టీ-నోట్‌ లేదు...
 
కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతల అభ్యంతరాల నేపథ్యంలో ఆంటోనీ కమిటీని తెరమీదకు తెచ్చి ఆ కమిటీ సిఫారసుల కోసమంటూ కొత్త వాదన ముందుపెట్టి పరిష్కారం చూపకుండా సాగదీస్తోంది. అయితే.. ఆంటోనీ కమిటీకి కేంద్ర హోంశాఖ రూపొందించి నివేదించే కేబినెట్‌ నోట్‌కు అసలు సంబంధమే లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్‌‌జ దిగ్విజయ్‌సింగ్‌ రెండు రోజుల కిందటే చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో ఈసారి జరిగే మంత్రివర్గ సమావేశంలో కేబినేట్‌ నోట్‌ రావడం ఖాయమని భావించారు. మంత్రిమండలి సమావేశం కావడానికి సరిగ్గా 24 గంటల సమయం కూడా లేకముందు మంత్రిమండలి ఎజెండాలో నోట్‌ ముసాయిదా ప్రస్తావన లేదని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ లీకులు బయటకొచ్చాయి.
 
 ఏమంటే కేబినెట్‌ నోట్‌ ముసాయిదాలో అనేక మార్పుచేర్పులు చేయాల్సిన అవసరం ఉందని, అవి పూర్తయిన తర్వాత మళ్లీ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మో„హన్‌ సింగ్‌ల పరిశీలనకు పంపిస్తారని, ఆ తర్వాత కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనకు వెళుతుందని, ఆ తర్వాతే మంత్రిమండలి ముందుకొస్తుందని ఇప్పుడు తాజాగా ప్రచారంలో పెట్టిన కథ. బుధవారం సాయంత్రం జరుగనున్న కేంద్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశం ఎజెండాలో.. కేవలం శిక్షపడిన ప్రజాప్రతినిధుల చట్టసభల సభ్యత్వం తక్షణం రద్దు కాకుండా అడ్డుకొనేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్‌‌స పునఃపరిశీలన మినహా మరే ఇతర అంశాలను పొందుపరచలేదని.. గురువారం నాటి మంత్రివర్గ సమావేశం ఎజెండాలో కూడా తెలంగాణ అంశాన్ని చేర్చలేదని తెలియవచ్చింది.
 
పొంతనలేని షిండే, దిగ్విజయ్‌ వ్యాఖ్యలు...
 
నోట్‌పై షిండే, దిగ్విజయ్‌లు ఇప్పటివరకూ తమ నోటితోనే చెప్పిన విషయాలకూ.. తాజా పరిణామాలకు ఏమాత్రం పొంతన లేకపోవటం గమనార్హం. ఇదంతా నాటకంలో భాగమేనని అటు కాంగ్రెస్‌ పార్టీ, ఇటు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి విశ్వసనీయ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. కేబినెట్‌ నోట్‌ దాదాపు సిద్ధమైందని, దాన్ని త్వరలోనే కేబినెట్‌ భేటీలో చర్చకు పెట్టి ఆమోదిస్తారని దిగ్విజయ్‌ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆంటోనీ కమిటీ ఇచ్చే సిఫారసులను తెలంగాణ బిల్లులోనే చేరుస్తారు తప్పించి కేబినెట్‌ నోట్‌లో కాదని కూడా ఆయన మొన్నటికి మొన్న స్పష్టంచేశారు. నోట్‌ ముసాయిదా సిద్ధమైందని స్వయంగా హోంమంత్రి షిండే కనీసం రెండు సందర్భాల్లో వెల్లడించారు. కానీ.. ఇప్పుడు నోట్‌ అసలు సిద్ధం కాలేదని, ఆంటోనీ కమిటీ సిఫారసుల కోసం నిరీక్షిస్తున్నామని, అవి వచ్చాక ముసాయిదా నోట్‌లో మార్పులు చేయాలని, దానికి తొలుత రాజకీయ ఆమోదం, తర్వాత న్యాయశాఖ ఆమోదం కావాలని తాజాగా షిండే నేతృత్వంలోని హోంశాఖ అధికార వర్గాల పేరుతో లీకులు రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదంతా కాంగ్రెస్‌ హైకమాండ్‌ నాటకంలో భాగమేనని విశ్వసనీయ వర్గాల కథనం. అంతా ఆ నాటకంలోని అంకాలే...
 
సీమాంధ్రలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని నేతలు ఏకరువు పెట్టడంతో రాజకీయంగా లబ్ధి పొందడానికి ఒకవైపు సీఎం కిరణ్‌ ద్వారా సొంత పార్టీపైనా తిరుగుబాటు చేస్తున్నట్లుగా తీవ్ర వ్యాఖ్యలు చేయించడం.. మరోవైపు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో సమావేశాలను నిర్వహింపచేయడం, పీసీసీ అధ్యక్షుడు బొత్సతో రాజీనామాకు సిద్ధమంటూ లీకులు ఇప్పించడం.. ఇవన్నీ అధిష్టానం రచించిన డ్రామాలోని అంకాలేనని ఆ వర్గాలంటున్నాయి. అధిష్టానాన్ని ధిక్కరిస్తూ సీఎం బాహాటంగా తీవ్ర వ్యాఖ్యలు చేసినా పార్టీ పెద్దలెవరూ దీనిపై గట్టిగా స్పందించకపోవడాన్ని, దిగ్విజయ్‌ తాజాగా దీనిపై స్పందనకు నిరాకరించడాన్ని బట్టి ఇదంతా హైకమాండ్‌కు తెలిసే జరుగుతోందన్న అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తోంది. కాగా, నవంబర్‌లోగానీ తెలంగాణ అంశం ఒక కొలిక్కి రాదంటూ ఏఐసీసీ వర్గాలు కొత్త లీకును ప్రచారంలోకి తెస్తుండటం మరో విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement