
గోపీనాథ్ ముండే(ఫైల్)
న్యూఢిల్లీ: కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్ట్ పెట్టుకునివుంటే గోపీనాథ్ ముండే బతికేవారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ అభిప్రాయపడ్డారు. సీటు బెల్ట్ ప్రాణాలను కాపాడుతుందా అనే నిర్లక్ష్య భావన వల్లే తన స్నేహితుడు ముండేను కోల్పోయానని చెప్పారు. కారు వెనుక సీటుకు ఉండే బెల్టులు అలంకారప్రాయయని చాలా మంది భావిస్తుండడం దురదృష్టకరమని అన్నారు. కారులో ప్రయాణించే వారందరూ సీటు బెల్ట్ పెట్టుకోవడం అవసరమని గట్టిగా చెప్పారు.
సీటు బెల్ట్ పెట్టుకోవడం ద్వారా కొన్ని ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడొచ్చని పేర్కొన్నారు. వాహనాల్లో ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై త్వరలో చైతన్య కార్యక్రమాలు చేపడతామని హర్షవర్థన్ తెలిపారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే వైఎస్ఆర్ సీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి, టీడీపీ నేత లాల్ జాన్ భాషా మృతి చెందిన సంగతి తెలిసిందే.