ఐసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడో! | when will be held Icet counselling ? | Sakshi
Sakshi News home page

ఐసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడో!

Published Mon, Aug 10 2015 2:09 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

ఐసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడో! - Sakshi

ఐసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడో!

* ఇప్పటివరకూ విడుదల కాని నోటిఫికేషన్
* కొనసాగుతున్న వాయిదాల పర్వం
* విద్యాసంవత్సరం ప్రారంభమై వారం గడిచినా రాని స్పష్టత
* పట్టించుకోని ఉన్నత విద్యా మండలి
* ఆందోళనలో వేల మంది విద్యార్థులు

 
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్-2015 కౌన్సెలింగ్ కోసం విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ ఏడాది మే 22న ప్రవేశ పరీక్ష నిర్వహించినా కౌన్సెలింగ్ నిర్వహణపై ఉన్నత విద్యా మండలి ఇప్పటివరకూ చర్యలు చేపట్టలేదు. కాలేజీల అనుబంధ గుర్తింపు విషయంలో యూనివర్సిటీలతో చర్చించడంలో విద్యామండలి అలసత్వం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వస్తున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై వారం రోజులు గడిచినా ఐసెట్ కౌన్సెలింగ్‌పై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఐసెట్‌లో అర్హత సాధించిన 58,037 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ కోసం నిరీక్షణ తప్పేలా లేదు.
 
 జూలైలోనే జరగాల్సింది..
 మేలో జరిగిన ఐసెట్ ఫలితాలు జూన్‌లోనే వెలువడ్డాయి. పరీక్షకు 63,490 మంది విద్యార్థులు హాజరుకాగా 58,037 మంది అర్హత సాధించారు. జూలై 11న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఐసెట్ ఫలితాల విడుదల సందర్భంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. 17న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 18 నుంచి 22 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 25న సీట్లు కేటాయిస్తామన్నారు. అయితే ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోలేదు.
 
 కాలేజీలకు అనుబంధ గుర్తింపు రాకపోవడంతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. కాగా, ఆగస్టు 3 నుంచి కౌన్సెలింగ్ చేపడతామని విద్యా శాఖ గతంలో పేర్కొనగా, అదీ ఆచరణలోకి రాలేదు. ఇప్పటివరకు ప్రవేశాల కౌన్సెలింగ్ నోటిఫికేషన్  వెలువడకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత విద్యా మండలి త్వరగా ప్రవేశాలకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement