
ఎంపీ కీర్తి ఆజాద్
ఎంపీ కీర్తి ఆజాద్ ను బీజేపీ సస్పెండ్ చేయడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి.
న్యూఢిల్లీ: ఎంపీ కీర్తి ఆజాద్ ను బీజేపీ సస్పెండ్ చేయడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పిన ఆజాద్ పై కమలం వేటు వేయడాన్ని పలు రాజకీయ పార్టీలు తప్పుబట్టాయి. బీజేపీలో ప్రజాస్వామ్యం లేదని, అవినీతిపరులను కాపాడేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
యాంటి కరెప్షన్ కాస్తా యాంటి బీజేపీగా మారిందని... ఇప్పుడు ప్రధాని మోదీ కొత్త నినాదం ఇదేనని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జివాలా ట్విటర్ లో పేర్కొన్నారు. వ్యాపం, లలిత్ మోదీ, పీడీఎస్ కుంభకోణాల్లో నిందితులను ప్రధాని నరేంద్ర మోదీ కాపాడారని, డీడీసీఏ స్కామ్ లో ఇరుక్కున్న వారిని కూడా ఇప్పుడు రక్షిస్తున్నారని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా అసహనం ఎక్కడా అని ట్విటర్ లో ప్రశ్నించారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకా లేదా అవినీతిని బయటపెట్టినందుకు ఆజాద్ పై చర్య తీసుకున్నారా అని యూత్ కాంగ్రెస్ ట్విటర్ లో ప్రశ్నించింది. అవినీతిని బయటపెడితే ఎవరికైనా ఇలాంటి గతే పడుతుందని ఈ చర్యతో బీజేపీ హెచ్చరించిందని పేర్కొంది. ఎవరైనా అవినీతి గురించి వెల్లడిస్తే ఎలాంటి చర్య తీసుకోవాలో ఆజాద్ పై వేటు ద్వారా తమ పార్టీ ముఖ్యమంత్రులకు బీజేపీ సందేశమిచ్చిందని ఎద్దేవా చేసింది.
ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాత్ర ఉందని ఆరోపణలు చేసిన కీర్తి ఆజాద్ ను బీజేపీ బుధవారం సస్పెండ్ చేసింది.
Where is zero tolerance against corruption? PM Modi protecting the accused - first Vyapam-Lalit Modi-PDS scam. Now DDCA scam #KirtiAzad
— Gaurav Gogoi (@GauravGogoiAsm) December 23, 2015