ఢిల్లీ సీఎంపై మరో కేసు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, ఢిల్లీ క్రికెట్ సంఘాల మధ్య వివాదం మరింత ముదురుతోంది. అరుణ్ జైట్లీ ఇప్పటికే కేజ్రీవాల్పై పరువు నష్టం దావా వేయగా, డీడీసీఏ కూడా అదేబాటలో నడవాలని నిర్ణయించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో పాటు బీజేపీ బహిష్కృత ఎంపీ కీర్తి ఆజాద్లపై పరువు నష్టం కేసు దాఖలు చేయనున్నట్టు బుధవారం డీడీసీఏ ప్రకటించింది.
అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డీడీసీఏలో దారుణ అక్రమాలు, అవినీతి జరిగాయని మంగళవారం కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. డీడీసీఏ అధికారులు లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను డీడీసీఏ ఖండించింది. కేజ్రీవాల్ ఎలాంటి ఆధారాలూ లేకుండా, గుడ్డిగా ఆరోపణలు చేశారని పేర్కొంది. డీడీసీఏ కుంభకోణంలో జైట్లీ పాత్ర ఉందని గతంలో కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ కేసు నుంచి జైట్లీని తప్పించడానికే తన కార్యాలయంలో సీబీఐ దాడులు చేయించారని విమర్శించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను ఖండించిన అరుణ్ జైట్లీ ఆయనపై పరువు నష్టం కేసు వేశారు. ఇక కీర్తి ఆజాద్.. డీడీసీఏతో పాటు జైట్లీపై విమర్శలు చేసి బీజేపీని సస్పెండ్ అయ్యారు.