
ఆర్‌బీఐ, ఫెడ్ నిర్ణయాలపై దృష్టి
న్యూఢిల్లీ: ఈ నెలాఖర్లో పరపతి విధాన సమీక్షలను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ), అమెరికా ఫెడరల్ రిజర్వ్(ఫెడ్)లపై స్టాక్ మార్కెట్లు దృష్టిపెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఈ వారం మార్కెట్ల గమనాన్ని ఈ రెండు అంశాలూ ప్రధానంగా నిర్దేశించనున్నట్లు తెలిపారు. వీటితోపాటు బ్లూచిప్ కంపెనీలు ప్రకటించనున్న క్యూ3 ఫలితాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు కూడా సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపుతాయని చెప్పారు.
మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి కదలికలకు కూడా ప్రాధాన్యత ఉంటుందని వివరించారు.
ఈ నెల 28న ఆర్‌బీఐ పరపతి సమీక్షను చేపట్టనుండగా... 28, 29 తేదీల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమీక్ష నిర్వహించనుంది. నెలకు 85 బిలియన్ డాలర్ల బాండ్‌ల కొనుగోళ్ల(సహాయక ప్యాకేజీ)లో 10 బిలియన్ డాలర్ల కోత(ట్యాపరింగ్)ను ఈ నెల నుంచే మొదలుపెడుతున్నట్లు ఫెడ్ ఇదివరకే ప్రకటించడం తెలిసిందే.
భారీ హెచ్చుతగ్గులు...
ఈ నెల 30న(గురువారం) జనవరి సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల గడువు ముగియనుండటంతో మార్కెట్లు భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశమున్నదని విశ్లేషకులు తెలిపారు. ప్రధాన ఇండెక్స్‌లైన సెన్సెక్స్, నిఫ్టీలలో దీర్ఘకాలిక బుల్లిష్ ధోరణి కనిపిస్తున్నందున కనిష్ట స్థాయిలవ ద్ద కొనుగోళ్లకు అవకాశముంటుందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సంకేతాలు, క్యూ3 ఫలితాలు, ఆర్‌బీఐ పాలసీ సమీక్ష వంటి అంశాలు సమీప కాలానికి మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పారు. ఈ వారంలో నిఫ్టీకి 6,350 స్థాయి కీలకంగా నిలవనుందని అంచనా వేశారు. ఈ స్థాయికి ఎగువన కొనుగోళ్లు పుంజుకుంటాయని చెప్పారు.
బ్లూచిప్స్ ఫలితాలు...
ఈ వారం పలు బ్లూచిప్ కంపెనీలు క్యూ3 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ జాబితాలో... ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్, బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, పీఎన్‌బీ, ఆటో దిగ్గజాలు మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, మెటల్ దిగ్గజాలు సెసా స్టెరిలైట్, జిందాల్ స్టీల్, ఇంధన దిగ్గజాలు ఎన్‌టీపీసీ, గెయిల్‌తోపాటు, మొబైల్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి.