ఒక రాజకీయ పార్టీ తరఫున పార్లమెంట్‌కు ఎన్నికైన లేదా నామినేట్ అయిన సభ్యుడు బహిష్కరణకు గురైనా కూడా అతను
పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు
తన తీర్పు పునస్సమీక్షకు నో
అమర్‌సింగ్, జయప్రదల పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: ఒక రాజకీయ పార్టీ తరఫున పార్లమెంట్‌కు ఎన్నికైన లేదా నామినేట్ అయిన సభ్యుడు బహిష్కరణకు గురైనా కూడా అతను పార్టీ విప్‌కు కట్టుబడి ఉండాల్సిందేనని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి 1996లో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు సుప్రీం కోర్టు బుధవారం నిరాకరించింది. ఈ తీర్పు ఇప్పటికీ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. 2010 ఫిబ్రవరి 2న రాజ్యసభ సభ్యుడైన అమర్‌సింగ్‌ను, లోక్‌సభ ఎంపీ అయిన జయప్రదను సమాజ్‌వాదీ పార్టీ బహిష్కరించింది. 2012లో బిజూ జనతాదళ్ పార్టీ నుంచి ప్యారీమోహన్ మహాపాత్ర బహిష్కరణకు గురయ్యారు. వీరు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి 1996 నాటి తీర్పును పునస్సమీక్షించాలని కోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్.. పిటిషనర్ల పదవీకాలం ముగిసిందని, దీనిపై సుదీర్ఘ వాదనలు విన్నామని, ఈ ప్రశ్నకు ఇప్పుడు జవాబివ్వకపోవడమే సరైనదని పేర్కొంది.
ఆ పిటిషన్లు ఇప్పుడు వ్యర్థమంటూ తోసిపుచ్చింది. అంతకుముందు జయప్రద, అమర్‌ల లాయర్లు వాదనలు వినిపిస్తూ.. 1996 నాటి జి.విశ్వనాథన్ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు తమకు వర్తించదని, తాము పార్టీకి రాజీనామా చేయలేదని, సొంత పార్టీ పెట్టుకోలేదని తెలిపారు. పార్టీకి రాజీనామా చేసిన వారికి లేదా పార్టీలో ఉండి విప్‌ను ధిక్కరించిన వారికే ఈ చట్టం వర్తిస్తుందన్నారు. పార్టీయే తమను బహిష్కరించింది కనుక ఏ పార్టీకీ చెందని సభ్యులుగా ఉంటామని, అందువల్ల పార్టీ విప్‌కు కట్టుబడాల్సిన అవసరం లేదని అన్నారు. మరోవైపు కేంద్రం ఒక పార్టీ నుంచి ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యుడు బహిష్కరణకు గురైనా కూడా అతను పార్టీ నియంత్రణలోనే ఉంటారని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.