ఛోటారాజన్కు భారత పాస్పోర్ట్ ఎలా వచ్చింది?
ముంబై: పరారీలో ఉన్న అండర్ వరల్డ్ మాఫియా డాన్ ఛోటారాజన్ అరెస్టుతో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. రాజన్ వద్ద నుంచి ప్రామాణికమైన ఒరిజనల్ పాస్ పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకోవడం భద్రతావర్గాలను విస్మయపరుస్తున్నది. సాధారణంగా సామాన్య ప్రజలు పాస్ పోర్టు కావాలంటే ప్రామాణికమైన పత్రాలున్నా.. అధికారుల చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటిది రాజన్ కు సిడ్నీలోని భారత కాన్సులేట్ ద్వారా ప్రామాణిక పాస్ పోర్టు లభించడంలో ఎవరు సహకారం అందించారు? అసలు సరైన తనిఖీలు చేయకుండానే రాయబార కార్యాలయం అధికారులు రాజన్ చేతిలో పాస్ పోర్టు పెట్టారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
కర్ణాటక మాండ్యకు చెందిన మోహన్ కుమార్ పేరిట భారత పాస్ పోర్టుతో ప్రయాణిస్తున్న ఛోటా రాజన్ ను బాలీ ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. అతనికి 2008 జూలై 8న భారత సిడ్నీలోని భారత కాన్సులేట్ ఈ పాస్ పోర్టు జారీచేసింది. అయితే రాజన్ కొత్త పాస్ పోర్టుకు ఆస్ట్రేలియాలో దరఖాస్తు చేసుకున్నాడా? లేక తన పాస్ పోర్టు పోయిందని మరో పాస్ పోర్టు పొందాడా? అన్నది తెలియాల్సి ఉంది. కొత్త పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు తప్పనిసరిగా తన పాత పాస్ పోర్టు నెంబర్ తో సహా వివరాలు తెలియజేయాలి.
అయితే, ఈ నిబంధనలన్నింటినీ దాటుకొని, మారుపేరుతో రాజన్ పాస్ పోర్టు ఎలా పొందాడన్నదే ఇప్పుడు భద్రతా వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నది. సామాన్యులు పాస్ పోర్టు పొందడానికి సవాలక్ష ఇబ్బందులు పడుతుంటే, పేరుమోసిన డాన్ లు, నేరగాళ్లు అవలీలగా మారుపేర్లతో అక్రమంగా పాస్ పోర్టులు తీసుకొని విదేశాల్లో యథేచ్ఛగా తిరుగడంపై వారు సీనియర్ పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.