
ఎమిరేట్స్ విమానం ఎందుకు కూలిందంటే?
న్యూఢిల్లీ: తిరువనంతపురం నుంచి బయలుదేరిన ఎమిరేట్స్ విమానం దుబాయ్ ఎయిర్‌పోర్టులో గతవారం కూలిన సంగతి తెలిసిందే. గాలి వీయడంలో ఒక్కసారిగా వచ్చిన మార్పు కారణంగానే ఈ విమానం క్రాష్‌ల్యాండ్ అయిందని ప్రాథమికంగా నిర్ధారించారు. అదృష్టం బాగుండి ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ గాయాలూ కాలేదు. ప్రయాణికులు, విమాన సిబ్బంది దాదాపు 300మంది సురక్షితంగా బయటపడ్డారు.
బోయింగ్ 777 విమానం ఒక్కసారిగా క్రాష్‌ల్యాండ్ అయి.. దాని రోల్స్ రాయిసీ ఇంజిన్స్ నిలువునా తగలబడిపోయి.. ఎట్టకేలకు అతికష్టం మీద కడుపుభాగం (కిందిభాగం) ఆధారంగా విమానం ఆగింది. ల్యాండింగ్ సందర్భంగా అత్యంత ఉత్కంఠరేపిన ఈ ప్రమాదం సమయంలో ఏం జరిగింది? ఎలా ప్రమాదం నుంచి బయటపడగలిగారు? అన్నదానిపై పైలట్లు 'ఈవెంట్ సమ్మరీ' పేరిట సమర్పించిన నివేదికను తాజాగా ఓ మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది. దీని ప్రకారం.. మొదటిసారి విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. కానీ భీకరమైన గాలులు వీయడంతో సురక్షితంగా విమానాని ల్యాండ్ చేయడం సాధ్యపడలేదు. రన్‌వేపై అనుకున్న ప్రదేశంలో ల్యాండ్ చేయలేకపోయారు. దీంతో ముందుకెళుతున్నకొద్దీ రన్‌వే అయిపోతుండటంతో ల్యాండ్ చేసే ఆలోచనను పైలట్లు మానుకున్నారు. ఈ సమయంలోనే పరిణామాలు తీవ్ర భయంకరంగా పరిణమించాయి. గాలిలో ఒక్కసారిగా అకస్మాత్తుగా మార్పులు రావడం వల్ల ఇలాంటి ముప్పు పొంచి ఉంటుంది. కానీ ఎంతటి మోడ్రన్ విమానమైనా గాలిలో ఉన్నఫలానా తలెత్తే మార్పుల్ని గుర్తించడం చాలావరకు అసాధ్యం.
ఈ క్రమంలో చుట్టూ తిరిగివచ్చి మరోసారి విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. ఈ క్రమంలో గాలిలో మార్పుల (విండ్‌షియర్) కారణంగా విమానం స్పీడ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. విండ్‌షియర్ ప్రాసెస్‌ను చేసినప్పటికీ రన్‌వేపై విమానం క్రాష్‌ల్యాండ్ అయి.. ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అవి విమానాన్ని చుట్టుముట్టాయి. పైలట్లు ఈ అత్యవసర పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా.. విమానం క్రాష్‌ల్యాండ్ అవ్వడంతో రన్‌వేపై స్కిడ్డయింది. త్రుటిలో ప్రయాణికులకు పెనుప్రమాదం తప్పినప్పటికీ ఎమిరేట్స్‌కు బోయింగ్ విమానం పూర్తిగా తగలబడింది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో పైలట్లు తీసుకొనే కొన్ని నిర్ణయాలు తప్పు అయ్యే అవకాశముంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.