'పాక్ సరిహద్దు గ్రామాల ఖాళీ' రాజకీయమా? | Why Pak border villages havebeen evacuvated | Sakshi
Sakshi News home page

'పాక్ సరిహద్దు గ్రామాల ఖాళీ' రాజకీయమా?

Published Tue, Oct 4 2016 6:49 PM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM

'పాక్ సరిహద్దు గ్రామాల ఖాళీ' రాజకీయమా? - Sakshi

'పాక్ సరిహద్దు గ్రామాల ఖాళీ' రాజకీయమా?

చండీగఢ్: పాకిస్థాన్‌తో భారత సరిహద్దుకు పది కిలోమీటర్ల లోపలున్న గ్రామాలన్నింటినీ ప్రభుత్వం  ఖాళీ చేయడం పట్ల ప్రజల్లోనే కాకుండా, సైనికుల్లోనూ అనుమానాలు రేకెత్తుతున్నాయి. పాకిస్థాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతుందన్న అనుమానంతోని తమ గ్రామాలను ఖాళీ చేయించారా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం ఖాళీ చేయించారా? అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ ఖాళీ చేయకుండా ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
 
‘రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను (2017, జనవరిలోగా జరగాలి) దృష్టిలో పెట్టుకొనే రాజకీయ ప్రయోజనం కోసమే గ్రామాలను కేంద్రం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేయించిందని నేను నమ్ముతున్నాను. పాకిస్థాన్ సైన్యం దాడులు జరిపే సూచనలు సరిహద్దుల్లో ఏ మాత్రం కనిపించడం లేదు. పాక్ భూభాగంలోకి భారత సైనికులు చొచ్చుకుపోయి సర్జికల్ దాడులు జరిపారన్న విషయాన్ని కూడా నమ్మలేక పోతున్నా. పాక్ భూభాగంలో భారత్ సైనికులు పది గంటలపాటున్నా పాక్ సైనికులకు వారు కనిపంచలేదా? 38 మంది టైస్టులు ఒకే చోట ఎలా ఉంటారు? ఉన్నా ఒక్క పౌరుడిని కూడా హతమార్చకుండా అంతమంది ఉగ్రవాదులను ఎలా హతమార్చారన్నది అంతుచిక్కని విషయం' అని బాబాజీగా మాత్రమే తన పేరు వెల్లడించిన మాజీ సైనికాధికారి ఒకరు భనేవాలే సరిహద్దు గ్రామంలో పర్యటించిన ఓ ఎన్జీవో బృందంతో వ్యాఖ్యానించారు.  
ఇంకా.. తమ వద్ద దాడులకు సంబంధించి వీడియో రికార్డులు ఉన్నాయని ప్రభుత్వం, సైనిక వర్గాలు చెబుతున్నప్పటికీ వారి వాదన నమ్మశక్యంగా లేదని, సినిమాలోలాగా సరిహద్దుల్లోని అడవుల్లో షూటింగ్ చేసి వీడియో రికార్డు చేసి ఉండవచ్చు లేదా భారత భూభాగంలో నిర్మానుష్యం ప్రాంతంలో సినిమా షూటింగ్ తరహాలోనే వీడియోలు తీసి ఉండవచ్చని ఆ సైనికాధికారి అంటున్నారు. సైన్యం ఖాళీ చేయించిన ఫిరోజ్‌పూర్ జిల్లాలోని భనేవాలేతోపాటు జల్లోకే, చుడియా, టిండియా, గట్టీ రహీమ్‌కే, గట్టీ రాజోకే గ్రామల్లో ఇటీవల శర్పాల్ సింగ్, హరిజిత్ సింగ్ నేతృత్వంలోని ఓ ఎన్జీవో బృందం పర్యటించింది. ఆ బృందం తమ అనుభవాలను మీడియాతో పంచుకొంది.
 
తాము పర్యటించిన అన్ని గ్రామాల్లో మెజారిటీ ప్రజలు ఖాళీ చేసి జిల్లా కేంద్రానికి వెళ్లారని, అక్కడి గురుద్వారాలు, పాఠశాలల్లో వారు తాత్కాలికంగా తలదాచుకుంటున్నారని శర్పాల్ సింగ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం  అన్ని సరిహద్దు గ్రామాల్లోను కొంత మంది ప్రజలు ఇప్పటికీ నివసిస్తున్నారు. పంట చేతికొచ్చే సమయం అవడం వల్ల కొంద మంది రైతులు, పేదరికం వల్ల కొన్ని కుటుంబాలు, పాకిస్థాన్ దాడికి పాల్పడుతుందన్న అనుమానం లేకపోవడం వల్ల మరి కొన్ని కుటుంబాలు గ్రామాల్లోనే నివసిస్తున్నాయి. టీవీ వార్తలు చూసి నమ్మకండి, పాకిస్థాన్ సైనికులు దాడులకు పాల్పడే అవకాశం లేదని భారత సరిహద్దు దళాలే ప్రజలకు భరోసా ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. గ్రామాలను ఖాళీ చేయాల్సిందిగా ప్రజలకు సైన్యం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదట. గురుద్వార్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నుంచి మాత్రమే ఉత్తర్వులు వచ్చాయట. 
ఎన్జీవో బృందం కారులో పాక్ సరిహద్దులోని ఓ వంతెన పైనుంచి వెళుతుండగా వంతెనపై ఇద్దరు సైనికులు నిలబడి పిచ్చాపాటి మాట్లాడుకోవడం కనిపించింది. దూరాన ఐదు మిలటరీ వ్యాన్లు ఆగి ఉన్నాయి. సరిహద్దు ఆవల పాక్ విద్యుత్ దీపాల వెళుతురు మసక్కా కనిపిస్తోంది. ఈ బృందం ఇన్ని సరిహద్దు గ్రామాలు తిరిగినా, అక్కడక్కడా సైనికులు తారసపడినా ఎక్కడా ఏ సైనికుడు కారును ఆపలేదు. ఎవరంటూ విచారించలేదు. కనీసం కారులో ఏముందని కూడా తనిఖీ చేయలేదు. 
 
ఎన్జీవో బృందం భనేవాలే గ్రామంలోకి వెళ్లినప్పుడు చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. హఠాత్తుగా పంజాబ్ పోలీసుల ఎస్కార్ట్‌తో స్థానిక జిల్లా పరిషద్ చైర్మన్ కారుతోపాటు ఢిల్లీలో రిజిస్టరైన కొన్ని కార్లు ఊర్లోకి వచ్చాయి. ఆ కార్లను వెంబడిస్తూ వెళ్లగా  ఓ మైదాన ప్రాంతంలో దేదీప్యమానంగా వెలుగుతున్న ఫ్లడ్‌లైట్లు కనిపించాయి. సరిహద్దు గ్రామాల్లో లైట్లు వేయరాదంటూ అధికారిక ఆదేశాలు ఉన్నప్పటికీ ఎందుకు లైట్లు వేశారంటూ దగ్గరికెళ్లగా, అక్కడ హెలిపాడ్‌ను నిర్మించే పనులు చకచకా జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ సోమవారం నాడు సరిహద్దు గ్రామాల పర్యటనకు వస్తున్నారట. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతోని కలసి ఆయన పార్టీ అకాలీదళ్ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ప్రభుత్వం పనితీరుపట్ల ప్రజల్లో ఈసారి తీవ్ర వ్యతిరేకత ఉంది. 
 
అక్కడి నుంచి ఎన్జీవో బృందం ఫిరోజ్‌పూర్ జిల్లా కేంద్రానికి తిరిగొస్తుండగా, గుడ్డి దీపాల మధ్య చిన్న కొట్లు తెరచి ఉండడం, అక్కడక్కడా వసారాల్లో కూర్చొని మగవాళ్లు చతుర్ముఖ పారాయణం చేయడం కనిపించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement