
ఉపరాష్ట్రపతిగా ఉషాపతి ఎందుకు?
న్యూఢిల్లీ: ‘నేను రాష్ట్రపతిని కావాలనుకోవడం లేదు, ఉపరాష్ట్రపతిని కావాలనుకోవడం లేదు. ఉషాపతిగా నేను ఆనందంగా ఉన్నాను (భార్యపేరు ఉషా)’ అని గత మే నెలలో బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి వెంకయ్య నాయుడిని బీజేపీ నేతృత్వంలోని పాలకపక్షం ఎంపిక చేసే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వచ్చినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఊహించని విధంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలు రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అనూహ్య నిర్ణయమే ఉంటుందని పార్టీతో సహా అన్ని వర్గాలు భావించాయి.
అందుకు విరుద్ధంగా వెంకయ్య నాయుడు పేరును తెరపైకి తీసుకరావడం ద్వారా మోదీ ద్వయం మళ్లీ ఆశ్చర్యపరిచారు. రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడికి అన్ని అర్హతలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దక్షిణాదికి చెందిన ఆయన సీనియర్ ఆరెస్సెస్ కార్యకర్త. కరడుగట్టిన హిందుత్వవాది. రాజ్యసభకు నాలుగుసార్లు ఎన్నికకావడమే కాకుండా బీజేపీకి అధ్యక్షుడిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఇంగ్లీషుతోపాటు హిందీ కూడా బాగా మాట్లాడగలరు. అన్నింటికన్నా మోదీకి మౌఖిక అభిమాని. ఒకప్పుడు కేంద్ర మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన వెంకయ్య నాయుడిని ఉద్దేశపూర్వకంగానే తక్కువ ప్రాధాన్యతగల కేంద్ర పట్టణాభివృద్ధితోపాటు సమాచార, ప్రసారాల శాఖను అప్పగించారని, ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్న ఆయన్ని ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం అంటే ప్రభుత్వ లేదా పార్టీ వ్యవహారాల నుంచి ఆయన్ని తప్పించడానికేనన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఉప రాష్ట్రపతి పదవంటే విదేశాలు తిరుగుతూ దేశ దౌత్య సంబంధాలను మెరగుపర్చుకోవడమేనన్న భావన కొంతమందిలో ఉండవచ్చు. రాజ్యసభ చైర్మన్‌గా ఆయన నిర్వహించాల్సిన బాధ్యతలు కీలకమైనవి. కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీకి రాజ్యసభలో తగిన బలంలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యసభను సమర్థంగా నిర్వహించాల్సిన బాధ్యత వెంకయ్య నాయుడి భుజస్కంధాలపై ఉంటుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా విఫలమైన ఆయన ఈ విషయంలో విజయం సాధిస్తారని నమ్మడం ఆశ్చర్యమే. పన్నులు లేదా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన బిల్లులు రాజ్యసభకు వచ్చినప్పుడు అవి ఆర్థిక బిల్లులా, కావా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిందీ చైర్మన్‌గా ఉపరాష్ట్రపతిది.
ఆర్థిక బిల్లులంటూ లోక్‌సభకు పంపించే బిల్లులపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం లోక్‌సభలకే ఉంటుంది. వాటికి రాజ్యసభ ఆమోదం అవసరం లేదు. ఈరకంగా మోదీ విధేయుడిగా వెంకయ్య నాయుడు తన బాధ్యతలను నిర్వర్తించగలరు. రాష్ట్రపతి పదవికే మొదట వెంకయ్య నాయుడు పోటీ పడ్డారని, ప్రస్తుతానికి ఉపరాష్ట్రపతి పదవితో సంతృప్తి పడమని, భవిష్యత్తులో పదోన్నతి చూడవచ్చని పార్టీ అధిష్టానం అయనకు నచ్చ చెప్పిందనే వాదన కూడా వినిపిస్తోంది.