పశువుల దాణా స్కాం కేసులో తమ తండ్రి లాలూ ప్రసాద్ను దోషిగా నిర్ధారించడాన్ని హైకోర్టులో సవాలు చేయనున్నట్లు ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ పెద్దకుమారుడు తేజస్వి యాదవ్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రజాకోర్టులోకి కూడా తీసుకెళ్తామన్నారు.
లాలూప్రసాద్ను దాణా కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చిన తర్వాత ఆయనను రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో లాలూకు బెయిల్ కోసం కూడా తాము దరఖాస్తు చేస్తామని తేజస్వి తెలిపారు. పశువుల దాణా స్కాం కేసులో.. బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్, జగన్నాథ మిశ్రా సహా మొత్తం 45 మంది నిందితులనూ కోర్టు దోషులుగా నిర్ధారించింది.
ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ప్రవస్ కుమార్ సింగ్ తీర్పు వెలువరించారు. వీరికి శిక్షను అక్టోబర్ 3న వెలువరిస్తారు.తొలుత హైకోర్టులోను, తర్వాత సుప్రీంకోర్టులో కూడా.. తమకు న్యాయం జరగబోదన్న అనుమానాలను లాలూ వ్యక్తం చేశారని, చివరకు ఆయన అనుమానించినట్లే జరిగిందని ఆర్జేడీ ఎంపీ ప్రభునాథ్ సింగ్ అన్నారు.