ఒక్క అవకాశం ఇవ్వండి! | Will carry forward Vajpayee's dreams for Kashmir, says narendra modi | Sakshi
Sakshi News home page

ఒక్క అవకాశం ఇవ్వండి!

Published Mon, Dec 8 2014 11:48 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ఒక్క అవకాశం ఇవ్వండి! - Sakshi

ఒక్క అవకాశం ఇవ్వండి!

* కశ్మీర్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా: మోదీ
* బీజేపీకి మెజారిటీ ఇవ్వండి; రాష్ట్రంలో అవినీతిని అంతం చేస్తా
* సాంబ, శ్రీనగర్ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ

శ్రీనగర్: ‘ఒక్క అవకాశం ఇవ్వండి. మీకు సేవ చేసేందుకు ఒకే ఒక్క చాన్స్ ఇవ్వండి. మీ బాధను, ఆవేదనను పంచుకుంటాను. మీ సమస్యలను, కలలను నావిగా భావిస్తాను. మొత్తం నా ప్రభుత్వాన్ని మీ సేవలో నిలుపుతాను. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఇవ్వండి, రాష్ట్రాన్ని అభివృద్ధిలో కొత్తశిఖరాలకు చేరుస్తాను’ అని ప్రధాని నరేంద్రమోదీ జమ్మూకశ్మీర్ ప్రజలను అభ్యర్థించారు. జమ్మూ ప్రాంతంలోని సాంబాలో, కశ్మీర్‌లోయలోని శ్రీనగర్‌లో ఆయన సోమవారం ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. శ్రీనగర్‌లోని ‘షేర్ ఇ కశ్మీర్’ క్రికెట్ స్టేడియంలో భారీగా హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి అరగంట పాటు ప్రసంగించారు. కశ్మీర్‌లోయలో మోదీ తొలి ఎన్నికలసభ ఇదే. సభలో కశ్మీర్ సంప్రదాయ వస్త్రధారణలో మోదీ ఆకట్టుకున్నారు.

ఇన్సానియత్.. కశ్మీరియత్.. జమ్హూరియత్
2003లో ఇదే వేదికపై నుంచి మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత ఏబీ వాజపేయి చేసిన ప్రఖ్యాత వ్యాఖ్య ‘ఇన్సానియత్(మానవత్వం), కశ్మీరియత్(కశ్మీరీతత్వం), జమ్హూరియత్(ప్రజాస్వామ్యం)’ను మోదీ గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధికి ఈ మూడు మూల స్తంభాలంటూ.. వాజపేయి ప్రారంభించిన ఈ భావనను ముందుకుతీసుకెళ్తానని, కశ్మీర్‌కు సంబంధించి ఆయన కలలను నిజం చేసేందుకు కృషి చేస్తానన్నారు. కశ్మీరీలు తనపై ఎంతో విశ్వాసం, ప్రేమ చూపారని, అభివృద్ధి రూపంలో వాటిని వడ్డీతో సహా తీర్చుకుంటానన్నారు. పర్యాటక, విద్యారంగాలను అభివృద్ధి చేస్తామని, ఇక్కడి జలవనరులతో విద్యుదుత్పాదన చేస్తామని  హామీ ఇచ్చారు. దాల్ సరస్సు పర్యాటకులతో నిండి ఉండగా చూడాలని ఉందన్నారు.  పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చిన శరణార్థులకు, ఇక్కడినుంచి తరలివెళ్లిన శరణార్థులకు పునరావాసం కల్పించడం ప్రభుత్వ జాతీయ బాధ్యత అని స్పష్టం చేశారు.

వారి పాలనలో రాష్ట్రం సర్వనాశనం
రాష్ట్ర ప్రజల కోసం కాకుండా.. సొంత కుటుంబ అభివృద్ధే పరమావధిగా రాజకీయాలు చేశారంటూ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫెరెన్స్, పీడీపీలపై మోదీ  విరుచుకుపడ్డారు. అవి అధికారం కోసం చేతులు కలిపి, ఎన్నికల్లో విమర్శలు చేసుకుంటాయని, ఇలాంటి అవకాశవాద రాజకీయాలకు అంతం పలకాలని కోరారు. కాంగ్రెస్‌ను ఒక్కస్థానంలోనూ గెలిపించవద్దన్నారు. ఉగ్రవాదం అంతమైన ఈ రాష్ట్రంలో అవినీతి అంతానికి తమతో చేతులు కలపాలన్నారు.  

ఓటేసే చూపుడు వేలే శక్తిమంతమైంది
అంతకుముందు సాంబా సభలో మాట్లాడుతూ.. ఏకే 47 రైఫిల్ ట్రిగర్‌ను నొక్కే చూపుడు వేలు కన్నా.. ఈవీఎం యంత్రాలపై ఓటేసే వేలు మరింత శక్తిమంతమైందన్నారు. ‘ట్రిగర్‌పై వేలు ప్రాణాలు తీస్తుంది. ఈవీఎంలపై వేలు దేశ భవిష్యత్తునే మార్చేస్తుంది’ అన్నారు. ఒకప్పుడు తప్పుదారి పట్టిన రాష్ట్ర యువత ఇప్పుడు తుపాకులకు బదులు ‘ఆండ్రాయిడ్ 1’మొబైల్ ఫోన్లను కోరుకుంటున్నారన్నారు.  మొదటి, రెండో దశల ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్‌తో.. బుల్లెట్‌పై విజయం సాధించారంటూ రాష్ట్ర ప్రజలను అభినందించారు.
 
ఆ త్యాగం వృథా కాకూడదు
నాలుగు రోజుల క్రితం యూరి పట్టణంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది భద్రతాసిబ్బందికి మోదీ నివాళులర్పిస్తూ.. వారి త్యాగం, వారి సాహసం వ్యర్థం కావడానికి వీల్లేదన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశ రక్షణలో సరిహద్దులో 33 వేలమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ‘ఇటీవలి వరదల్లో ప్రజలను రక్షించే క్రమంలో కొందరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్లో దేశ రక్షణ విధుల్లో ఉన్న వేలాది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.. కొందరు అమాయక పౌరులూ చనిపోయారు. వారందరి కుటుంబాలకు ఇది తీరని నష్టం. పంచుకోవడం ద్వారానే ఆ బాధను తగ్గించగలం’ అన్నారు.

అలాగే, ‘బుద్గాంలో ఇద్దరు అమాయక యువకులను కాల్చి చంపిన సైనికులపై చర్యలు తీసుకున్నాం. గత 30 ఏళ్లలో ఏ ప్రభుత్వమైనా ఈ ధైర్యం చేసిందా?’ అని  ప్రశ్నించారు. వారిని కాల్చడం పొరపాటేనని విలేకరుల సమావేశం పెట్టి మరీ ఆర్మీ తన తప్పును ఒప్పుకుందని గుర్తు చేశారు. ‘మీ ప్రధాన సేవకుడిగా మీ బాధ నా బాధ కూడా.. మీ విషాదం, మీ ఆవేదన నాది కూడా’ అని కశ్మీరీలతో మమేకమయ్యేందుకు ప్రయత్నించారు. అంతకుముందు బాదామీబాగ్ ఆర్మీ కార్యలయం వద్ద యుద్ధస్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి యూరి దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించారు.  మోదీ తన ప్రసంగాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదానిచర్చే  370 అధికరణను ప్రస్తావించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement