
శ్రీనగర్ : భారత ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులామ్ నబి ఆజాద్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆదివారం జమ్మూలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ నరేంద్ర మోదీ నుంచి ప్రజలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దేశ ప్రధాని స్థాయికి ఎదిగినా ఆయన తన మూలాలు మర్చిపోలేదు. తననో చాయ్‌వాలాగా గర్వంగా చెప్పుకుంటారు’’ అని అన్నారు. తనకు, మోదీకి రాజకీయాల పరంగా విభేదాలు ఉన్నప్పటికి, వ్యక్తిగతంగా ఆయన ఉన్నతుడన్నారు.
కాగా, కొద్దిరోజుల క్రితం గులామ్ నబి ఆజాద్ రాజ్యసభ పదవీకాలం ముగియనున్న సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేస్తూ.. ఆజాద్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురై, కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజ్యసభలో విపక్ష నేతగా ఆజాద్ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమైన విషయమని ప్రధాని పేర్కొన్నారు. సొంత పార్టీ ప్రయోజనాలతో పాటు రాజ్యసభ, భారతదేశ ప్రయోజనాలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు.
కరోనా సమయంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఆజాద్ తనను కోరారని, దాంతో వెంటనే అఖిలపక్ష భేటీ పెట్టానని గుర్తు చేశారు. తాను గుజరాత్ సీఎంగా, కశ్మీర్ సీఎంగా ఆజద్ ఉన్నపుడు తాము మాట్లాడుకునేవారమన్నారు. కశ్మీర్లో గుజరాత్ యాత్రికులపై ఉగ్రదాడి జరిగిన సమయంలో తనకు మొదట ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది ఆజాదేనని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తీవ్రమైన ఉద్వేగానికి గురైన ప్రధాని కన్నీళ్లను నియంత్రించుకోలేకపోయారు. ‘అధికారం వస్తుంది. పోతుంది. కొందరికే ఆ అధికారాన్ని సరిగ్గా వినియోగించడం తెలుస్తుంది. అది ఆజాద్‌కు తెలుసు’అని అన్నారు.
చదవండి : 'ఆ చట్టాలు రైతుల పాలిట మరణ శాసనాలు'
Comments
Please login to add a commentAdd a comment