
వచ్చే ఏడాది పదవి వదులుకుంటా: గవర్నర్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నారాయణస్వామితో విభేదాలతో మరోసారి వార్తల్లోకి వచ్చిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి సంచలన ప్రకటన చేశారు. పదవీ త్యాగానికి సిద్ధపడుతున్నట్టు వెల్లడించారు. వచ్చే ఏడాది గవర్నర్‌గిరిని వదులుకుంటానని ‘ఏఎన్‌ఐ’ వార్తా సంస్థతో చెప్పారు. 2018, మే 29 నాటికి తాను పదవిలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుందని, తర్వాత తాను పదవిలో కొనసాగనని అన్నారు. దీని గురించి ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది.
కిరణ్ బేడి ప్రకటన రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం నారాయణస్వామితో ఏర్పడిన విభేదాల కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం మొదలైంది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు పుదుదచ్చేరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే కిరణ్‌బేడి ఈ నిర్ణయం వెలువరించడం గమనార్హం. మాజీ ఐపీఎస్ అధికారి అయిన కిరణ్‌బేడి 2016, మే 29న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, అవినీతి అంతం కోసం పలు చర్యలు చేపట్టారు.