దయ్యాలకు చదువొస్తుందా...
మహబూబ్‌నగర్: ఈ గ్రామంలోని ఓ కాలనీలో ఏ ఇంటి ముందు చూసినా ‘ఓ స్త్రీ రేపురా..’అని బొగ్గుతో రాసి ఉంది. గత రెండు రోజులుగా కాలనీలో రాత్రిపూట మహిళదయ్యం తిరుగుతోందట. మహిళ స్వరం, ఏడుపుశబ్ధంతో మధ్యరాత్రి దయ్యం తిరుగుతోందని కాలనీవాసులు భయపడుతున్నారు. రాత్రి 8గంటలకే ఇళ్లకు గొళ్లం వేసుకొని బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే గడుపుతున్నారు. బయటికి చెప్పాలన్నా దయ్యం ఏంచేస్తుందోనని మరింత భయపడుతున్నారు. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట మండల పరిధిలోని తుంకిమెట్లలోని 4వవార్డు తెలుగుగడ్డ (చిక్కలిగేరి)లో ఇంటిపైన రెండవ అంతస్తులో ఓ మహిళకు శుక్రవారం అర్ధరాత్రి తన ఇంటి వెనక ఉన్న విద్యుత్ స్తంభం వద్ద మహిళ ఏడుస్తున్నట్లు శబ్ధం వినిపించింది. బయటకు వచ్చి చూసింది. కుక్కలు మొరుగుతూ శబ్ధం వచ్చిన చోటే చుట్టుముట్టాయని మహిళ చెబుతుంది.
కొద్దిసేపటికీ మహిళ ఏడుపు శబ్ధం ఆగిపోయి, కుక్కలు మొరగడం ఆపివేశాయని చెబుతున్నారు. కొద్దిసేపటికీ దయ్యం ఉండవచ్చనని మహిళ భయపడింది. దీంతో తెల్లారేసరికీ మహిళకు జ్వరం వచ్చింది. ఇది తెలిసిన కాలనీవాసులంతా భయాందోళనకు గురయ్యారు. కాలనీలో దయ్యం భయం చుట్టుకుంది. ఇంటి ముఖద్వారం గోడలకు ‘ఓ స్త్రీ రేపురా..’అంటూ రాసుకున్నారు. శనివారం రాత్రి మరో మహిళకు.. మహిళస్వరంతో బాధగా ఆయాసంగా మూలుగుతూ ఉన్నట్లు శబ్ధం వినపడిందట. దీంతో తమ కాలనీలో రాత్రి పూట దయ్యం తిరుగుతోందిని, దయ్యం ఇంటి వద్దకు వచ్చి పిలుస్తుందని భావిస్తున్నారు. దీనిపై గ్రామంలో ‘దయ్యం’ భయాన్ని పోగొట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.
దయ్యానికి చదువొచ్చా..?
రాత్రిపూట దయ్యం తిరుగుతోందని, ఇంటి వద్దకు వచ్చిన దయ్యం బయటినుంచే వెళ్లిపోవాలని భావించి ఇంటి గోడలకు రాసుకుంటున్న ‘ఓ స్త్రీ రేపురా..’ రాతలు చూసి విద్యావంతులు, హేతువాదులు అవాక్కవుతున్నారు. రాసిన అక్షరాలను చదువుకొని తిరిగి వెళ్లాలంటే దయ్యానికి చదువు వొచ్చా, వస్తే దయ్యానికి చదువు ఎవరు నేర్పారు? ఏబడిలో చదివిందో చెబుతారా? అంటూ దయ్యం మూఢనమ్మకాన్ని వెక్కిరిస్తున్నారు.